Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాల మేధావుల "అబాకస్" మాయాజాలం...!!

బాల మేధావుల
FILE
పెద్దవాళ్లు సైతం చెప్పలేని ఎంత క్లిష్టమైన లెక్క అయినా సరే, క్షణాల్లో చెప్పేస్తారు ఈ చిన్నారులు. అలాగని వీళ్ళేమీ బాలమేధావులు కారు. చాలా సాధారణమైన విద్యార్థులే. అయితేనేం లెక్కలు మాత్రం వీరికి కొట్టినపిండి. నీళ్ళు తాగినంత సులభంగా వీరు లెక్కల్ని చెప్పగలరు. సుదీర్ఘమైన గుణింతాలు, భాగహారాలను కూడా సెకన్లలో చెప్పేస్తారు వీళ్లు.

అంత తేలికగా లెక్కల్ని చేస్తున్న వీళ్లకి ఏవో మాయలూ, మంత్రాలు వచ్చి ఉంటాయని ఆలోచించకండి. ఎందుకంటే, ఈ చిన్నారులకు పాపం, అలాంటివేమీ తెలియవు. మరెలా సాధ్యం అనుకుంటున్నారా..? అదేమరి "అబాకస్" మహిమ. మనసులనే కంప్యూటర్‌గా మలచుకుని సంక్లిష్టమైన లెక్కల్ని సైతం వేగంగా చేసే పద్ధతినే "అబాకస్" అంటారు.

గ్రీకు భాషలో అబాక్స్ అంటే లెక్కించే పలక (కౌంటింగ్ టేబుల్) అని అర్థం. దీని ద్వారానే లాటిన్ పదం అయిన "అబాకోస్" పుట్టింది. లెక్కల కోసం ప్రస్తుతం వాడే కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు తదితర ఆధునిక సాంకేతి పరిజ్ఞానంతో కూడిన పరికరాలకు కూడా ఇదే ఆధారం. క్రీస్తు పూర్వం రోజుల్లోనే ఈ విధానం అమల్లో ఉండేదట. అప్పట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రేము లోపల పూసలను ఉంచి లెక్కించేవారు.

మెసపుటోమియా, ఈజిప్షియన్ గ్రీకులు, చైనీయులు, రోమన్ల నాగరికతల్లో అబాకస్ విధానం అమల్లో ఉండిందని చరిత్రకారులు చెబుతుంటారు. క్రీస్తు శకం తరువాత నుంచి ఈ విధానాన్ని భారతీయులు కూడా ఉపయోగించినట్లు "అభిధర్మకోశం"లో వివరించారు. ఈ రోజుల్లో పిల్లలు ఉపయోగించే కొన్నిరకాల పలకలకు ఓ వైపు అడ్డంగా ఏర్పాటు చేసిన ఊచలకు రంగు రంగుల పూసలు కూర్చి ఉంటాయి కదా...! ఇలా ఉండటమే అబాకస్‌కు ఆనవాళ్ళుగా చెబుతారు.

అదలా కాసేపు పక్కన పెడితే... పది సంవత్సరాల క్రితమే పలు నగరాలలో వెలుగుచూసిన ఈ విధానం పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. గత ఐదు సంవత్సరాల నుంచి మాత్రమే ఈ విధానానికి మంచి స్పందన కనిపిస్తోంది. అబాకస్ ఆవశ్యకత తెలుసుకున్న పెద్దలు తమ పిల్లలకు ఈ శిక్షణను ఇప్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

పలు నగరాలలో ఇప్పటికే అబాకస్ శిక్షణ ఇచ్చేందుకు పలువురు ఫ్రాంచైజీలుగా వ్యవహరిస్తున్నారు. వీరి ద్వారా పలు పాఠశాలలు కూడా తమ విద్యార్థులకు అబాకస్ శిక్షణ ఇస్తున్నాయి. ఇందుకుగానూ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు.

"అబాకస్ శిక్షణ" ఎలా ఉంటుందంటే...?

అబాకస్‌లో ఎనిమిది దశలుంటాయి. తొలి దశలో అబాకస్ పరికరం వాడుక విధానం తెలియజేస్తారు. ఇది బలపంతో పలకపై రాయడాన్ని నేర్పించటం లాంటిదే. తరువాత ఒక్కో దశలో కూడికలు, తీసివేతలు, భాగహారం తదితర గణాంకాలను నేర్పిస్తూ... చివరకు పరికరం సహాయం లేకుండానే సంక్లిష్ట లెక్కలను వేయటాన్ని కూడా నేర్పిస్తారు. ఈ విధంగా మొత్తం రెండు సంవత్సరాలపాటు అబాకస్‌లో పూర్తి శిక్షణ ఇప్పించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల చిన్నారులకు ప్రస్తుతం ఆయా నగరాలలో ఈ శిక్షణను అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu