Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫీజులకు కళ్లెం వేయాల్సింది కలెక్టర్లే : ప్రభుత్వం

ఫీజులకు కళ్లెం వేయాల్సింది కలెక్టర్లే : ప్రభుత్వం
FILE
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజుల నిర్ధారణ, నియంత్రణల అధికారాన్ని కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే జిల్లా ఫీజు నియంత్రణా కమిటీ (డీఎఫ్‌ఆర్‌సీ)లకే అప్పగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవోఎంఎస్ నెం.91ని ప్రభుత్వం జారీ చేసింది.

ట్యూషన్ ఫీజులకు సంబంధించి స్కూల్ గవర్నింగ్ బాడీ పంపించిన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్, డీఈఓ, జిల్లా ఆడిట్ అధికారితో కూడిన త్రిసభ్య కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. టీచర్లు, సిబ్బంది జీతాలు, రిటైర్మెంట్ సదుపాయాలు, నిర్వహణ వ్యయాలు, మౌలిక సౌకర్యాలను బట్టి ఫీజులు ఎంత ఉండాలనేది వారు ప్రతిపాదించాల్సి ఉంటుంది. పేరెంట్-టీచర్లతో కూడిన అసోసియేషన్ (పీటీఏ)లు పై కసరత్తును చేయాల్సి ఉంటుంది.

జీవోఎంఎస్ నెం.91 ప్రకారం.. ప్రతియేటా సెప్టెంబరు 30వ తేదీ లోపు ఫీజుల ప్రతిపాదనలు డీఎఫ్‌ఆర్‌సీలకు పంపించాలి. అయితే తల్లిదండ్రుల వినతులను కూడా పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 31వ తేదీలోపు తదుపరి విద్యా సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజులను నిర్ధారిస్తారు. ఖర్చులు, సదుపాయాలను బట్టి వీటిని ఏక మొత్తంగా ప్రతిపాదించాల్సి ఉంటుంది. ప్రత్యేక ఫీజు, డెవలప్‌మెంట్ ఫీజులంటూ.. వేర్వేరుగా ఉండకుండా, అన్నీ ట్యూషన్ ఫీజు పేరుతోనే ఉండాలి.

ఫీజును కమిటీ ఓసారి ఆమోదిస్తే అది మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది. అయితే నిత్యావసరాల ధరలు పెరిగితే మాత్రం మళ్లీ ప్రతిపాదనలు పంపించే అవకాశం ఉంటుంది. దరఖాస్తు రుసుము వందకు, రిజిస్ట్రేషన్ ఫీజు 500లకు, రీఫండంబుల్ కాషన్ డిపాజిట్ 5 వేల రూపాయలకు మించకుండా ఉండాలి.

అలాగే... పాఠశాలల పేర్లకు ముందు ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర.. తదితర పేర్లు ఉండకుండా చూడాలి. ట్యూషన్ ఫీజుల చెల్లింపునకు విద్యార్థులకు కనీసం మూడు నెలల వాయిదాను ఇవ్వాలి. డీఎఫ్‌ఆర్‌‌సి ఆమోదించిన ఫీజులపై అభ్యంతరాలు ఉంటే పాఠశాల విద్యా కమీషనర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu