Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆచార్యులకు ప్రధాని శుభాకాంక్షలు..!

ఆచార్యులకు ప్రధాని శుభాకాంక్షలు..!
, శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (16:07 IST)
FileFILE
భవిష్యత్తులో రానున్న 11వ పంచవర్ష ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం "విద్యా ప్రణాళిక"గా అమలు చేస్తుందని దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వెల్లడించారు. 'ఉపాధ్యాయ దినోత్సవం' సందర్భంగా... "జాతీయ అధ్యాపక అవార్డుల"తో ఉపాధ్యాయులను సత్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మాట్లాడుతూ... టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన తనకు అప్పటికీ, ఇప్పటికీ విద్యాబోధన అంటే ఎంతో మక్కువని చెప్పారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన తనకు ఇంతమంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను కలుసుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఇక విద్యారంగం విషయానికొస్తే... ముఖ్యంగా, పాఠశాల విద్యారంగంలో గత నాలుగు సంవత్సరాలుగా పెట్టుబడులు కొన్ని రెట్లు పెరిగాయని మన్మోహన్ చెప్పారు. అందరికీ విద్య అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని, అందుకనుగుణంగా ప్రభుత్వం పలురకాల చర్యలను చేపట్టిందని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన పిల్లల విద్యాభివృద్ధికి పలు స్కాలర్‌షిప్‌లను ప్రకటిసూ, పాఠశాల స్థాయిలో ఉచిత విద్యను అమలు చేస్తున్నామని ప్రధాని మన్మోహన్ పునరుద్ఘాటించారు. ఇప్పటికీ పాఠశాలలకు వెళ్ళని బడిఈడు పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉన్నందుకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం లాంటి పలు ప్రోత్సాహక చర్యలు చేపట్టడం ద్వారా పాఠశాలలకు వస్తోన్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని మన్మోహన్ చెప్పారు. బడిపిల్లలందరికీ ఉచితంగా యూనిఫారాలు, టెక్ట్స్ పుస్తకాల సరఫరా, బాలికలకు ఉచిత హాస్టళ్లు లాంటివి కల్పించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu