Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తపాతమే ఎంటర్‌టైన్‌మెంట్ కాదు: జీవీ

రక్తపాతమే ఎంటర్‌టైన్‌మెంట్ కాదు: జీవీ
WD
తెలుగులో విలన్లు లేరనుకుంటున్న తరుణంలో ఆరడగుల ఎత్తు, తీక్షణమైన కళ్లు, హిప్పీ తరహా జుట్టుతో విలక్షణంగా కన్పించే జీవీ అందర్నీ ఆకట్టుకున్నాడు. పరభాషా విలన్లకు ధీటుగా తెలుగోడి సత్తా ఏమిటో? అటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమకు రుచి చూపించాడు.

నటనలో జీవీగా పరిచయమైన ఆయన తనలోని మరోకోణాన్ని దర్శకత్వ రూపంలో ఆవిష్కరిస్తూ తన అసలు పేరు సుధాకర్ నాయుడుతో ముందుకు వస్తున్నారు. నితిన్ కథానాయకుడిగా భావన హీరోయిన్‌గా "హీరో" అనే చిత్రానికి ఆయన నిర్దేశకత్వం వహించారు. ఈ సందర్భంగా జీవీ పలు విషయాలు వెల్లడించారు. అవి మీ కోసం...

ప్రశ్న... "హీరో" టైటిల్ అంటే సినిమా నేపథ్యమా?
జ.. కానే కాదు. కథానాయకుడు పాత్రపేరు రాధాకృష్ణ. అదే టైటిల్ అయితే ఎఫెక్ట్‌గా ఉండదని కథ ప్రకారం పెట్టాం. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడే హీరో అనుకుంటాడు. చాలా సందర్భాల్లో తనకు తానే అలా భావిస్తాడు. అలా 22 ఏళ్ల కుర్రాడైన మా హీరో ఆలోచనలకు తగ్గట్టుగా చాలా సరదాగా గడపాలనుకుంటాడు. అటువంటి వ్యక్తికి గోల్ ఏర్పడితే పరిస్థితులు ఎలా ఉంటాయి. తన సరదాలే జీవితం కాదు. జీవితంలోమరొకటి ఉందని గ్రహించి దాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించి హీరోగా ఎలా నిలిచాడన్నదే కథ.

ప్రశ్న... నటునిగా మీ ప్రస్థానం ఎలా అనిపించింది?
జ... దాదాపు 150 సినిమాల్లో విలన్‌గా నటించాను. అందర్నీ భయపెట్టాను. ఇన్నాళ్లు నన్ను ప్రోత్సహించిన దర్శకనిర్మాతలను మర్చిపోలేను. నటునిగా అగ్రహీరోల చెంతనే చేశాను. అన్నీ సక్సెస్ చిత్రాలే.

ప్రశ్న.... మరి దర్శకునిగా మారడానికి కారణం?
జ... మనిషి ఒక వృత్తినే ప్రేమించాలని లేదు. నాకు సినిమాలు, పాటలు, ఫైట్లు, కార్లు నడపడం అంటే చాలా ఇష్టం. పెళ్లైంది కాబట్టి కొన్ని చెప్పకూడదు. సినిమా అనేది సముద్రం. ఎన్ని చేసినా క్రియేటివిటీ అనేది వస్తూనే ఉంటుంది. ప్రతిభను నిరూపించుకోవడానికి స్వేచ్ఛ ఇక్కడుంది.

ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నేను ఇంటర్ తర్వాత సైన్స్ చదివా. కాదని మళ్లీ బి.ఎ. చదివా. తర్వాత.. ఎల్.ఎల్.బి., ఇదయ్యాక ఎల్.ఎల్.ఎం కోర్సు యూఎస్‌లో చేశాను. లాయర్‌గానూ ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్‌లో ఉండగానే సినిమాల్లో నటించాను. విలన్‌గా చేస్తున్నప్పుడే పాత్ర పరంగా, కథాపరంగా కొన్ని ఇలా ఉంటే బాగుంటుందేమోననిపించేది.

విలన్ పాత్ర ఇలా ఉంటే ఎలాగుంటుంది. హీరో మరోలా ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలు వచ్చేవి. అవన్నీ పుస్తకంలో రాసుకున్నా. నేనే దర్శకుడినైతే ఇవన్నీ అమలు చేయవచ్చు. నటుడిగా అయితే పరిమితం మేరకే నటించాలి. నాలో ఉన్న కొత్తకోణం అలా బయటపడింది.

webdunia
WD
దాంతో ఓ రోజు మన్యం రమేష్‌ పరిచయం కావడం, ఆయనకు కథ చెప్పడంతో నచ్చి అంగీకరించడంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినంత హ్యాపీగా ఉంది. కథాపరంగా నితిన్ అంగీకరించడంతో 48 గంటల్లో సినిమా ఓకే అయింది.

ప్రశ్న.... విలన్ పాత్రలు మీ సినిమాపై ఎటువంటి ప్రభావం చూపుతాయి?
జ.. నేను చేసిన సినిమాలన్నీ యాక్షన్ కాబట్టి నా నుంచి అదే ఆశిస్తారు. భయపెట్టి, రక్తపాతాలు చూపించడం సినిమా కాదు. వాటి కోసం ప్రత్యేక ఛానళ్లు, సినిమాలున్నాయి.

రక్తపాతం చూపడమే ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. నాకు కామెడీ అంటే ఇష్టం. చేసింది విలన్‌గా అయినా నాలో హాస్యం పాళ్లు ఎక్కువ. కన్నీళ్లు, కష్టాలు నా సినిమాలో ఉండవు. థియేటర్‌కు వచ్చిన వాడు హ్యాపీగా ఫీలయ్యేలా ఉంటుంది.

ప్రశ్న... భావన పాత్ర ఎలా ఉంటుంది?
జ...ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కోణాలున్నాయి. 5,6 వేరియేషన్స్ పాత్రలో కన్పిస్తాయి. తన పాత్రలోని వేరియేషన్స్‌ను ఆమె చక్కగా ప్రదర్శించింది. నటిగా సౌందర్య అంటే ఇష్టం. ఆమె లోటు భావన తీరుస్తుందని నా నమ్మకం.

ప్రశ్న... ఇందులో మీరు నటించారా?
జ... చేయలేదు. దర్శకత్వంపైనే దృష్టిపెట్టాను.

ప్రశ్న... నటునిగా కొనసాగుతారా?
జ... నటునిగానే కొనసాగుతాను. ఇన్నాళ్లు నన్ను ప్రోత్సహించిన వృత్తిని ఎలా వదులుకుంటాను. నటనను వదలను. కాకపోతే కాస్త తగ్గించుకుంటాను.

Share this Story:

Follow Webdunia telugu