Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామెడీ అంటేనే భయం. కానీ...: దేవీప్రసాద్

కామెడీ అంటేనే భయం. కానీ...: దేవీప్రసాద్
దేవీప్రసాద్.. దర్శకుడిగా తనకంటూ సినీ రంగంలో ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆడుతూ... పాడుతూ... "లీలామహాల్ సెంటర్‌"తో కామెడి దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న ఆయన ఆ తర్వాత "పాండు" అనే యాక్షన్ చిత్రాన్ని తీసి దెబ్బతిన్నారు. తాను ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చూస్తుంటానని, యాక్షన్ అంటేనే ఇష్టమని అంటున్న ఆయనకు... కామెడీ చిత్రాలే రావడం విశేషం. తాజాగా "బ్లేడ్‌బాబ్జీ"తో ఈ నెల 24న ముందుకు వస్తున్న ఆయన మళ్లీ అల్లరి నరేష్‌తో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలు...

ప్రశ్న... "బ్లేడ్‌బాబ్జీ" టైటిల్‌కు ఇన్‌స్పిరేషన్ ఏమిటి?
జ... చిన్నప్పుడు మా ఊర్లో బ్లేడ్‌శీను అనే పిక్‌పాకిటర్ ఉండేవాడు. అతనికి ప్రస్తుతం 60 ఏళ్లు. ఆయన్ను ఆయనే గొప్పగా చెప్పుకునే వాడు. ఆ పేరు బలేగా ఉందే అనిపించి...కథ అనుకున్నప్పుడే ఆ పేరే పెడదామనుకున్నాం. అప్పటికే గాలిశీను పేరు నరేష్‌కు పాపులర్ అయింది. అలా కాదని హ్యూమర్‌గా ఉండాలని "బ్లేడ్‌బాబ్జీ" అని పేరు పెట్టాం.

ప్రశ్న... కథకు ఏమైనా ఇన్‌స్పిరేషన్ ఉందా?
జ... రచయిత నేను ఓ కథ అనుకున్నాం. దొంగ అవసరార్థం పోలీసుగా మారితే ఎలా ఉంటుంది. పోలీసు అయినా దొంగబుద్ది మారకపోతే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయనేవి హాస్యంగా చూపించాం. పోలీసు అవ్వడం కూడా మంచి పర్పస్ కోసమే అవుతాడు. అది ఏమిటనేదే చిత్రం. ఇందులో సందేశాలు లేవు. పూర్తి వినోదభరిత చిత్రం.

ప్రశ్న... పోలీస్‌కు పారడీ అనుకోవచ్చా?
జ... అలా జరగలేదు. ఇందులో ప్రతీ పోలీసు నవ్వించే ప్రయత్నం చేస్తాడు. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో వారి గురించి పాజిటివ్‌గా తీసిందే. మేల్కొటి కమిషనర్, ధర్మవరపు సి.ఐ, ఎల్‌. బి. శ్రీరామ్ కానిస్టేబుల్. హీరో పోలీసు ఆఫీసర్. ఎవ్వరినీ కించపరిచేవిధంగా సినిమా తీయలేదు.

ప్రశ్న... "తమ్ముడు"లో పవన్ పాత్ర ఎలా ఉంటుంది?
జ... అది కేవలం ప్యారడీగా పెట్టాం. పవన్ కళ్యాణ్ ఇన్‌స్పిరేషన్‌తో పోలీసు అవ్వాలని హీరో అనుకుంటాడు. అందుకోసం ఫిజిక్ డెవలప్‌చేసుకుంటాడు. ఆయన చిత్రాలు చూసి ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటాడు.

ప్రశ్న... కామెడీ పండించడం కష్టమైన పనే కదా?
జ... నిజం చెప్పాలంటే.. కామెడీ అంటే నాకు చాలా భయం. కానీ గతంలో నేను చేసిన చిత్రాల్లో కామెడీ పండింది. ఎమోషన్స్, సెంటిమెంట్ పండించడం తెలీక... కామెడీ అనేది రాయడం, తీయడం, చేయడం కష్టం. నేను యాక్షన్ చిత్రాలంటే ఇష్టపడతాను. నాకు నచ్చిన అవకాశాలు అలా క్లిక్ అయ్యాయి. ఎన్ని ట్రెండ్‌లు మారినా కామెడీ మారదు. విజయవారి సినిమాల నుంచి నేటి వరకు నిజంగా నవ్వించ గలిగే సినిమాలు ఫెయిల్ కాలేదు. నవ్వు అపహాస్యం కాకుండా చూసుకుంటే చాలు.

ప్రశ్న... ఈనాడు కామెడీ చిత్రాలే ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి?
జ... ఆ మధ్య పత్రికల్లో ఓ వ్యాసం చదివాను. మనదేశంలోనే గుండెజబ్బుల శాతం ఎక్కువని. ఆ తర్వాత మానసిక ఆందోళన శాతం మరింతగా ఉందని రాశారు. కొందరు... ఎవరికిష్టమైన పనులు వారు చేస్తే... మరికొందరు వాటికి దూరంగా ఉంటారట. కొంతమంది వ్యాయామం చేస్తే ఆనందంగా ఉంటారు. మరికొందరు ఇష్టమైన పనిచేస్తే బాగుంటారు. కానీ అది సకాలంలో జరుగక పోవచ్చు. మరికొందరు యోగా చేసి ఆరోగ్యంగా ఉండొవచ్చు. వీటన్నిటికీ మనిషి కష్టపడాలి. అయితే ఏ కష్టం లేకుండా కాస్త నవ్వితే చాలు. ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తూనే ఉన్నారు. మనిషి నవ్వితే శరీరంలోని ఎండార్పిన్స్ రిలీజ్ అయి ఆరోగ్యంగా ఉంటాడని డాక్టర్లు చెబుతున్నారు. ఒక రకంగా కామెడీ అనేది డాక్టర్ చేసే ట్రీట్‌మెంట్. అందుకే ప్రతి ఒక్కరూ కామెడీవైపు మొగ్గుచూపుతున్నారు.

ప్రశ్న... ద్వందార్థాలను కూడా కామెడీ అనేవారున్నారుగదా?
జ.. నా చిత్రంలో ఉండదు. నేను సాధ్యమైనంత వరకు కట్ చేస్తాను. ఎవరి పంథా వారిది. ఏ వర్గాన్ని చూసి నేను సినిమా తీయను. అన్ని వర్గాల వారు కోరిన విధంగా నా చిత్రాలుంటాయి.

ప్రశ్న... కామెడీ నటుల ప్రోత్సాహం ఎలా ఉంది?
జ... నా చిత్రంలో కామెడీ ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్నారు. ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతే వారితో ఏ ఇబ్బంది ఉండదు. నేను నాలుగు చిత్రాలు చేశాను. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. పర్సనల్‌గా నన్ను ఇష్టపడే వారంతా.

ప్రశ్న.. అశ్లీలం లేదన్నారు. మరి ఐటంసాంగ్ ఉంది కదా?
జ... ఫార్ములా ప్రకారం కాదు. కథలో భాగంగా పెట్టాం.

ప్రశ్న.. సరదాగా సాగే సినిమాల్లో ట్విస్టులు, పాటలు అవసరమా?
జ... కథను ఇంట్రెస్ట్‌గా చెప్పాం. అందులో పాటలు కూడా కథారీత్యా సాగేవే. బ్యాంకాక్‌లో ఓ పాట తీయడానికి వెళ్లాం. మూడు రోజులు వర్షం వల్ల వాయిదా పడింది. దాంతో నిర్మాత భయపడ్డారు. వెంటనే పాటను లేకుండా చేశాం. కథలో హీరోను ఊహించుకున్న హీరోయిన్ పాట ఉంటుందని అనుకుంటారు కానీ బ్యాక్‌డ్రాప్‌లో ఊహల్లోకి వెళుతున్నావా? పని చూడవే... అనే వాయిస్ వస్తుంది. దీంతో ఆ సన్నివేశానికి ఇది కరెక్ట్ అనిపించింది. అలాగే మిగిలిన పాటలుంటాయి. ఇక ట్విస్ట్ అంటారా? ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించేందుకే పెట్టాం. నవ్వు కూడా మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చేలా ఉంటుంది.

ప్రశ్న... కొత్త చిత్రాల గురించి...?
జ... త్వరలో మళ్లీ నరేష్‌తో సినిమా చేస్తాను. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాను.

Share this Story:

Follow Webdunia telugu