సౌదీ అరేబియా మహిళా మంత్రి కూడా అనుమతి లేకుండా టీవీలో కనిపించరాదని ఓ వార్తాపత్రిక కథనం సోమవారం వెల్లడించింది. నౌరా అల్ ఫాయిజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళా విద్యా శాఖకు సహాయమంత్రిగా నియమితులయ్యారు.
తొలి మహిళా మంత్రి. ఆమె నియామకంతో సాంప్రదాయవాద సౌదీ అరేబియాలో మహిళల అభ్యుదయానికి తొలి అడుగు పడినట్లుగా అంతర్జాతీయ సమాజం హర్షం వ్యక్తం చేసింది. సౌదీలో ఇస్లాం ప్రాతిపదికన మహిళలు డ్రైవింగ్ చేయడం, ఓటు వేయడం, సంబంధంలేని వ్యక్తులతో కలిసి తిరగడం వంటివాటిపై నిషేధాలు అమలు అవుతున్నాయి.
అనుమతిలేకుండా తాను బురఖా తీయలేనని, టెలివిజన్‌లో కనిపించరాదని నౌరా ఓ వార్తాపత్రికతో చెప్పారు. సహాయమంత్రి ఫొటోను ఆ పత్రిక బురఖాతో ప్రచురించింది.
బాలికలు పాఠశాలల్లో ఆడుకోవడానికి అనుమతించాలనే డిమాండ్‌లను కూడా నౌరా తోసిపుచ్చారు. బాలికలు పాఠశాలల్లో ఆడుకోవడం సౌదీ ప్రభుత్వంచే నిషేధించబడివుంది. దీనిని తొలగించడం ఇప్పుడే సాధ్యపడదని నౌరా చెప్పినట్లు ఆ వార్తాపత్రిక వెల్లడించింది.