సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ)పై తమ వైఖరి ఏ మాత్రం మారలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ ప్రపంచ దేశాలకు తెలియజేశారు. ఈ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి కలిగివుందని అన్నారు. తమ ఆందోళనలను పరిష్కరించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడనంతవరకు సీటీబీటీపై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ నేతృత్వంలో గురువారం జరిగిన సమావేశంలో సీటీబీటీని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు మరోసారి తీర్మానం చేశాయి. భారత్, సహా ఎనిమిది ఇతర దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. భారత్ సీటీబీటీపై స్పష్టమైన వైఖరితో ఉంది. దానిని మార్చుకునేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదని కృష్ణ విలేకరులతో చెప్పారు.