లాకప్ డెత్‌ను నిరశిస్తూ లండన్‌లో చెలరేగిన అల్లర్లు సరిరద్దులను దాటాటి. పొలీసులు అన్యాయంగా ఒక యువకుడిని కాల్చిచంపినందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆందోళనకారుల విధ్వంసంతో నాలుగో రోజూ లండన్ బెంబేలెత్తిపోతోంది. దాడులు, దహనాలు, దోపిడీలు యథేచ్ఛగా సాగాయి. దీంతో దిక్కుతోచని బ్రిటన్ సర్కారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 16 వేల పోలీసు బలగాలను రంగంలోకి దింపింది.
ఇటలీ విహార యాత్రలో ఉన్న ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన పర్యటనను కుదించుకొని హుటాహుటిన దేశానికి చేరుకున్నారు. అల్లర్లకు బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పరిస్థితిని త్వరలోనే అదుపులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
లండన్‌లో మంగళవారం హింసాత్మక ఆందోళనలు కొనసాగాయి. లండన్‌తో పాటు బర్మింగ్‌హామ్, బ్రిస్టొల్, లివర్‌పూల్ నగరాలకు అల్లర్లు విస్తరించాయి. చాలాప్రాంతాల్లో యథేచ్ఛగా దుకాణ దోపిడీలు సాగాయి. వాహనాలు, భవనాల దహనాలతో ఆందోళనకారులను ప్రజలను భయవూభాంతులకు గురిచేశారు.
లండన్ వీధుల్లో విధ్వంసకాండకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ స్పష్టం చేశారు. అల్లరిమూకలపై చట్టప్రకారం ఉక్కుపాదం మోపుతామన్నారు. నగరంలో పూర్తిస్థాయిలో శాంతిభద్రతలను పునరుద్ధరిస్తామని తెలిపారు.