పాకిస్థాన్ ప్రభుత్వం నడుపుతున్న కాడెట్ కళాశాల నుంచి కిడ్నాప్ చేసిన కొందరు విద్యార్థులను, ఉపాధ్యాయులను తాలిబాన్ తీవ్రవాదులు గురువారం వదిలిపెట్టారు. పాక్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ గిరిజన ప్రాంతంలో ఇటీవల కాడెట్ కళాశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను తాలిబాన్లు కిడ్నాప్ చేశారు.
వీరిలో 80 మంది విద్యార్థులు, సిబ్బందిని ఇప్పటికే పాక్ ఆర్మీ విడిపించింది. తాజాగా 46 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను తాలిబాన్లు వారంతటవారే వదిలిపెట్టారు. గిరిజన పెద్దల జోక్యంతో తాలిబాన్లు విద్యార్థులను వదిలిపెట్టేందుకు అంగీకరించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనను దృష్టిలో ఉంచుకొని వారిని విడిచిపెట్టినట్లు తాలిబాన్ ప్రతినిధులు తెలిపారు.
గిరిజన పెద్దల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని విద్యార్థులను వదిలిపెడుతున్నట్లు తాలిబాన్ కమాండర్ బైతుల్లా మెహసూద్ ముఖ్య సహాయకుడు హాకీముల్లా మెహసూద్ పేర్కొన్నాడు. వజీరిస్థాన్ ప్రాంతంలోని రాజ్‌మక్ కాడెట్ కళాశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను తాలిబాన్లు రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. ఈ కళాశాలలో భవిష్యత్ ఆర్మీ అధికారులను తయారు చేస్తారు. వీరిని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో తాలిబాన్లు విడుదల చేస్తారు.