భారత సరిహద్దులు, గగనతలాన్ని తమ దళాలు ఉల్లంఘించాయని ఇటీవల జరిగిన ప్రచారంపై చైనా ప్రభుత్వం మరోసారి తీవ్రంగా స్పందించింది. భారత మీడియాలో సరిహద్దు ఉల్లంఘనల వార్తలు ఇటీవల పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. న్యూఢిల్లీ చైనా దౌత్యాధికారి జాంగ్ యాన్ మంగళవారం మాట్లాడుతూ.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
వాస్తవ పరిస్థితులను వివరించేందుకు జాంగ్ యాన్ మంగళవారం భారత హోం శాఖ కార్యదర్శి జీకే పిళ్లైతో సమావేశమయ్యారు. దీనికి ముందురోజు భారత ప్రభుత్వం కూడా మీడియాకు సుతిమెత్తని మందలింపు చేసింది. చైనా సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ రాద్ధాంతం చేయవద్దని సూచించింది.
తాజాగా చైనా దౌత్యాధికారి మాట్లాడుతూ.. సరిహద్దులో ఏమీ జరగడం లేదన్నారు. భారత మీడియా వారి నేతల మాటలు వినాలని సూచించారు. ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖను చైనా దళాలు ఉల్లంఘించినట్లు భారత మీడియాలో వచ్చిన వార్తలపై చైనా ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. దీంతో ప్రధాని మన్మోహన్ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. ఈ కథనాలను కొట్టిపారేశారు.