తీవ్రవాదం రూపుమాపే విషయంలో భారత్ వర్ణిస్తున్న పాఠాలు మేం వినబోమని పాకిస్థాన్ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ స్పష్టం చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోకుండా ఉండేలా ఆ దేశంపై ఒత్తిడి తేవాలని అమెరికాను కోరనున్నట్టు ఆయన తెలిపారు.
లాహోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముంబై 26/11 దాడులకు సూత్రధారిగా భావిస్తున్న జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను సంబంధిత వర్గాలు అని కొన్ని కారణాల వల్ల నిర్భంధించలేక పోతున్నట్టు చెప్పారు.
ముఖ్యంగా.. ముంబై దాడులకు సంబంధించి సరైన ఆధారాలు లేవన్నారు. అంతేకాకుండా, భారత్ బోధించే పాఠాలను ఇస్లామాబాద్ ఆలకించబోదన్నారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా అమెరికా ద్వారా భారత్‌పై ఒత్తిడి తీసుకుని రానున్నట్టు ఆయన తెలిపారు.
అదేసమయంలో జాతి ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా పీపీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి చర్య చేపట్టబోదని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయంపై తాలిబన్ తీవ్రవాదులు దాడిపై స్పందిస్తూ ఈ దాడిని సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారని గుర్తు చేశారు.