లండన్‌లో మొదలైన అరాచక శక్తుల విధ్వంస కాండకు ముగ్గురు ఆసియావాసులు బలయ్యారు. బ్రిటన్‌లో నాలుగు రోజుల పాటు జరుగుతున్న అల్లర్లకు బ్రిటన్‌లో స్థిరపడిన ముగ్గురు ఆసియావాసులు మృతి చెందారు. అంతేగాకుండా అల్లర్లు, దోపిడీలు బ్రిటన్‌లోని మరిన్ని నగరాలకు విస్తరించాయి.
ఈ అల్లర్లు మాంచెస్టర్, సాల్‌ఫోర్డ్, లివర్‌పూల్, వోల్వర్‌హాంప్టన్, నాటింగ్‌హామ్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ తదితర నగరాలకు విస్తరించాయి. మరో వైపు ఆసియావాసులు పెద్ద సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో గురుద్వారాలు, మసీదులు ఇతర ప్రార్థనా స్థలాలను పరరక్షించుకోవడానికి నిఘా బృందాలు తయారయ్యాయి.
కాగా, బుధవారం మరోసారి పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం జరిపిన తర్వాత బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ విలేఖరులతో మాట్లాడుతూ అల్లరి మూకలపై ఎదురుదాడి ప్రారంభమైనట్లు ప్రకటించారు. అయితే సమాజంలోని కొన్ని వర్గాల్లో నైతిక విలువలు లేకపోవడం, పూర్తి బాధ్యతారాహిత్యం కారణంగానే ఈ అల్లర్లు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.