బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన కనబర్చడంతో లేబర్ పార్టీ నాయకత్వంతో బ్రౌన్‌కు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ గతంలో ఎన్నడూలేని విధంగా అతితక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాలని లేబర్ పార్టీలో డిమాండ్‌లు వచ్చాయి. పలువురు కేబినెట్ మంత్రులు రాజీనామాలు చేయడంతో ఇబ్బందుల్లోపడ్డ బ్రౌన్ గతవారం మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ ద్వారా ఈ సమస్యల నుంచి గట్టెక్కారు. ఇదిలా ఉంటే తాజా యూరోపియన్ పార్లమెంటరీ ఎన్నికల్లో లేబర్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.
కన్జర్వేటివ్‌లు అగ్రస్థానంలో నిలవగా, యూకే ఇండిపెండెన్స్ పార్టీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. వీటి తరువాతి స్థానంతో లేబర్ పార్టీ సరిపెట్టుకుంది. దీంతో బ్రౌన్ తాజాగా ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోతున్న లేబర్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వాడివేడి ప్రశ్నలకు గోర్డాన్ బ్రౌన్ ఏం సమాధానం చెబుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది.