వెయ్యిమంది అమెరికా సైనికులను ఆఫ్గనిస్థాన్ దేశానికి పంపించడంతో ఏడాదికి వారికి అయ్యే ఖర్చు దాదాపు వంద కోట్ల డాలర్లని అమెరికా తెలిపింది.
ఆఫ్గనిస్థాన్ దేశంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకుగాను అమెరికా తన సైనిక బలగాలను అక్కడికి పంపించింది. దీంతో ప్రతి వెయ్యి మందికి ఏడాదికి అయ్యే ఖర్చు వంద కోట్ల డాలర్లౌతుందని వైట్‌హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు.
మరో నలభై వేల మంది అదనపు సైనిక బలగాలను పంపించాలని ఇటీవల ఆఫ్గనిస్థాన్‌లోనున్న అమెరికా కమాండర్లు అమెరికా ప్రభుత్వాన్ని కోరినారు. ఇంతమందిని అక్కడకు పంపేందుకు అమెరికా ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు.
ప్రస్తుత ఏడాది ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా 21 వేలమంది సుశిక్షితులైన సైనికులను ఆఫ్గనిస్థాన్ దేశానికి పంపిస్తామని గతంలో ప్రకటించియున్నారు.
కాని రోజురోజుకు తాలిబన్ వర్గీయుల దాడులు ఆ దేశంలో పెరిగిపోతుండటంతో అమెరికా, నాటో భద్రతాదళాలకు సంబంధించిన కమాండర్ జనరల్ మైక్‌క్రిస్టల్ మరో నలభై వేలమంది సైనికులను ఆఫ్గనిస్థాన్ పంపించాలని కోరారని ఆయన పేర్కొన్నారు.
ఆఫ్గనిస్థాన్ దేశంలోనున్న తాలిబన్ ఉగ్రవాదులను అంతమొందించడానికి అమెరికా, నాటో సైనికులు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.