పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో పాక్ సైన్యం అక్కడే స్థావరాలను ఏర్పరచుకుని ఉన్న తాలిబన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. సైనికుల పోరాట పటిమను చూసి అమెరికాకు చెందిన ఉన్నతాధికారి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారిని ప్రశంసించారు.
తాలిబన్ ఉగ్రవాదులతో పోరాడటమంటే ప్రాణాలకు తెగించి పోరాడాలని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వారు ధైర్యంగా ఉగ్రవాదులను ఎదుర్కొని పోరాడుతున్నారని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి మెచ్చుకున్నారు.
నేటి అత్యాధునికమైన సాంకేతిక విప్లవంలోనూ ఎంతో చాకచక్యంగా ఇలాంటి దాడులు జరపడం పట్ల తాను పాక్ సైన్యాన్ని ప్రశంసించకుండా ఉండలేకున్నానని అమెరికా మెరైన్ పోలీసు కమాండెంట్ జనరల్ జేమ్స్ కాన్వే తెలిపారు.
పాక్ సైన్యం తాలిబన్ ఉగ్రవాదులను హతమారుస్తున్న తీరులో ప్రత్యేకతను కనబరుస్తోందని ఆయన అన్నారు.
కేవలం వారివద్దనున్న సాంకేతిక, సైనిక బలంతోనే కరడుగట్టిన తాలిబన్, అల్ ఖైదా ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారనీ, ఇది ఎంతో ప్రశంసించదగ్గ విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అక్కడున్న ప్రజలను చూస్తే వారు పాక్ సైన్యాన్ని ప్రశంసించక తప్పదని ఆయన అన్నారు. పాక్ సైన్యం తీసుకునే చర్యలతో అక్కడి ప్రజలు వారికి సహాయ సహకారాలను అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యం చేస్తున్న పనికి తాము సలామ్ చెబుతున్నామని ఆయన తెలిపారు.