పాకిస్థాన్‌లోని రెండు ప్రాంతాలలో జుమా నమాజు తర్వాత వరుసగా రెండు పేలుళ్ళు జరిగాయి. తొలుత లాహోర్‌లో ఓ ఆత్మాహుతి దాడి జరుగగా మరో దాడి నౌషేరాలో జరిగింది. ఇక్కడ కారుబాంబు దాడి జరిగిందని ఈ దాడుల్లో మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
లాహోర్‌లో జుమా(శుక్రవారం ప్రత్యేక నమాజు)నమాజుకు ముందు జరిగిన దాడుల్లో మసీదు తునాతునకలై పైకప్పు కూలిపోయింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా చాలామంది నమాజుకు వచ్చినవారు తీవ్రగాయాలపాలైనారు.
గత కొద్ది రోజులుగా ఉగ్రవాదులే లక్ష్యంగా పెట్టుకుని పాక్ సైన్యం దాడులకు పాల్పడుతుండటంతోనే ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా అమెరికా పాక్ సైన్యానికి ప్రతి సంవత్సరం దాదాపు 1.5 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తోంది. ఇంత సొమ్ము ఉగ్రవాదులను అంతమొందించేందుకేనన్న విషయం తెలిసిందే. ఇలా ఈ సొమ్మును రానున్న ఐదు సంవత్సరాలవరకు అమెరికా పాకిస్థాన్‌కు అందజేయనుంది.
పాకిస్థాన్ సైన్యం గత నెల రొజులుగా స్వాత్ లోయలో స్థావరాలను ఏర్పరచుకున్న తాలిబన్లపై దాడులకు పాల్పడి వారిని హతమార్చుతోంది. ఈ మధ్య కొద్ది రోజులుగా వారి స్థావరాలపై సైనిక బలగాలు దాడులను ముమ్మరం చేసింది.
దీనికి ప్రతీకార చర్యగానే ఈ మానవ బాంబు పేలుళ్ళకు తాలిబన్ తీవ్రవాదులు ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా క్షతగాత్రులను వైద్యశాలలకు తరలించి వైద్యసేవలను అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.