పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ గత వారం రోజుల్లో రెండోసారి ఉపఖండ చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని భారత్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్- పాక్ మధ్య శాంతి ప్రక్రియ చర్చలను పునరుద్ధరించాలని, కాశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపాలని శుక్రవారం గిలానీ పునరుద్ఘాటించారు.
ఇరుదేశాల మధ్య చర్చల విషయంలో అనిశ్చితి నెలకొనడం ద్వారా తీవ్రవాదుల లబ్ది పొందే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత్- పాక్ మధ్య విభేదాలు తీవ్రవాదులకు అవకాశం కల్పిస్తాయని, ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
శాంతి ప్రక్రియ నిలిచిపోవడం ద్వారా తీవ్రవాదులే ప్రయోజనం పొందుతారని ఇస్లామాబాద్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్శిటీలో గిలానీ వ్యాఖ్యానించారు.
శాంతి ప్రక్రియ చర్చలు నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు. గత ఏడాది జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్ తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉందని బలంగా విశ్వసిస్తున్న భారత్ ఆ సమయంలోనే శాంతి ప్రక్రియ చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.