చైనా ఒత్తిడికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తలొగ్గారా? ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుని పెద్దన్న పాత్ర పోషించే అమెరికాను శాసించే శక్తి మరొకటి ఉందా? ఈ ప్రశ్నలకు అమెరికాలోని బౌద్ధులు సమాధానం చెపుతున్నారు. అమెరికాను శాసించే శక్తి చైనా రూపంలో వచ్చిందని అంటున్నారు.
అందుకే బౌద్ధమత గురువు దలైలామాకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సరైన గౌరవ మర్యాదలు ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దలైలామా అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. అయితే, దలైలామాను ఒబామా శ్వేతసౌధానికి ఆహ్వానించలేదు. దీనిపై అమెరికాలోని బౌద్ధులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
చైనా ఒత్తిడికి లొంగిడం వల్లే ఒబామా ఇలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. అయితే, ఈ వ్యవహారంపై అమెరికా విదేశాంగ మాత్రం మరోలా వివరణ ఇచ్చింది. నవంబరులో చైనా పర్యటనను ఒబామా ముగించిన తర్వాత దలైలామాతో భేటీ అవుతారని వివరణ ఇచ్చింది. టిబెట్ అంశంపై అమెరికా విధానం ఎన్నటికీ మార్పు ఉండబోదని ఆయన చెప్పారు.