ఫిలిప్పీన్స్ తీరంలో అమెరికా నౌకా దళానికి చెందిన యూఎస్ఎస్ జాన్ ఎస్ మెక్‌కెయిన్ నౌకను చైనాకు చెందిన ఓ జలాంతర్గామి (సబ్‌మెరైన్) ఢీకొంది. అమెరికా నౌకకు చెందిన సోనార్ అర్రేను నీటిలో చైనా జలాంతర్గామి ఢీకొనట్లు సీఎన్ఎన్ వెల్లడించింది.
సముద్రంలోని శబ్దాలను గుర్తించేందుకు ఉపయోగించే ప్రత్యేక ఏర్పాటు (సోనార్ అర్రే)ను చైనా జలాంతర్గాతమి ఢీకొనడంతో, అది ధ్వంసం అయింది. అయితే ఈ జలాంతర్గామి నేరుగా నౌకను ఢీకొనలేదని అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు.
ఈ సంఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు తావివ్వబోదని అమెరికా నేవీ భావిస్తున్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, చైనా నౌకల మధ్య రెండు వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయి. చైనా దూకుడుతో వ్యవహరిస్తోందని అమెరికా ఆ సందర్భంగా ఆరోపణలు గుప్పించింది.
దీనిపై అనంతరం చైనా స్పందిస్తూ.. అమెరికా నావికా దళానికి చెందిన నౌకలు జల సరిహద్దు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అమెరికాకు చైనా విజ్ఞప్తి చేసింది.