Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేట పేరిట సింహాన్ని పొట్టనబెట్టుకున్న డెంటిస్ట్: నెటిజన్ల నుంచి విమర్శల వెల్లువ!

వేట పేరిట సింహాన్ని పొట్టనబెట్టుకున్న డెంటిస్ట్: నెటిజన్ల నుంచి విమర్శల వెల్లువ!
, బుధవారం, 29 జులై 2015 (14:49 IST)
వేట పేరిట ఓ డెంటిస్ట్ మూగ జీవులను పొట్టనబెట్టుకున్నాడు. ఆ పాపం ఇప్పుడు పండింది. గతంలో జంతువుల వేటలో ట్రోఫీలను గెలుచుకున్న ఓ అమెరికా డెంటిస్టుకు ప్రస్తుతం నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇంతవరకు చేసిన పాపం చాలక తాజాగా పార్కులోని ఓ సింహాన్ని వేటాడిన ఆ డెంటిస్టు కొరివితో తలగీక్కుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే హవాంగే నేషనల్ పార్కులో వేలాది మందిని సిసిల్ అనే సింహం ఆకర్షించింది. 13 సంవత్సరాల ఈ సింహాన్ని వేటాడేందుకు అమెరికన్ బడాబాబు, డెంటిస్టు 50 వేల డాలర్లు చెల్లించి.. పార్కులోకి వెళ్లాడు. ఇక వేట మొటలెట్టాడు. ఓ బాణాన్ని సిసిల్‌పై వదిలాడు. ఆ బాధను అనుభవిస్తూ, 40 గంటల పాటు సిసిల్ నరకయాతన అనుభవించింది. 
 
అప్పటికీ దాని ప్రాణాలు పోలేదు. పార్కు అధికారులు సిసిల్ కోసం వెతికి, గాయపడ్డ సింహాన్ని చూసి, తుపాకీతో కాల్చి చంపి సులువుగా ప్రాణాలు కోల్పోయేలా చేశారు. అమెరికాలో డెంటిస్టుగా పనిచేస్తున్న వాల్టర్ జేమ్స్ పామర్ అనే మిలియనీర్, ఈ దయారహిత పనికి ఒడిగట్టాడు. ఇప్పుడు సిసిల్ సామాజిక మాధ్యమాల రూపంలో వాల్టర్‌పై గర్జిస్తోంది. తనను చంపిన పామర్‌పై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. 
 
పామర్ చేసింది ఎంతటి తప్పో నెటిజన్లతో సిసిల్ చెప్పిస్తోంది. చంపడాన్ని థ్రిల్‌గా తీసుకున్న పామర్‌కు శిక్ష పడాల్సిందేనని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 'సిసిల్ ది లయన్' పేరిట హాష్ ట్యాగ్ ఏర్పాటు కాగా, లక్షకు పైగా ట్వీట్లు పామర్‌కు వ్యతిరేకంగా రావడం గమనార్హం. 
 
సిసిల్‌కు పుట్టిన పిల్లలు ఇంకా దాని సంరక్షణలోనే ఉన్నాయని తెలుసుకున్న తరువాత ట్వీట్ల తీవ్రత మరింతగా పెరిగింది. మిన్నెపోలిస్‌లో ఆయన డెంటల్ డాక్టరుగా ప్రాక్టీసు చేస్తున్న క్లినిక్ ముందు నిరసన ప్రదర్శనలు జరిగాయి. సిసిల్ చిత్రాలు, దానికి నివాళిగా పూలు ఉంచి నిరసన కారుల నినాదాలకు క్లినిక్ మూతపడింది. ఆయనపై కేసు పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu