Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇకపై ఫేస్‌బుక్‌ వివరాలిస్తేనే వీసా... అమెరికా చర్యలు.. భారత్‌లో కూడానా?

భవిష్యత్‌లో అమెరికాకు వెళ్లాలనకునే వారు వీసా దరఖాస్తు చేస్తే ఖచ్చితంగా తమ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తదితర సామాజిక మాధ్యమాల ఖాతాల (యూఆర్ఎల్స్) వివరాలనూ అందజేయాల్సి ఉంటుంది.

ఇకపై ఫేస్‌బుక్‌ వివరాలిస్తేనే వీసా... అమెరికా చర్యలు.. భారత్‌లో కూడానా?
, గురువారం, 30 జూన్ 2016 (12:27 IST)
ప్రపంచాన్ని ఉగ్రవాదులు వణికిస్తున్నారు. ఎపుడు.. ఎక్కడ.. ఏ క్షణంలో దాడి చేస్తారోనన్న భయంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మన వెంటే.. మన చుట్టూత ఉండేవారిని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా వాసులైతే నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. దీనికి కారణం అన్ని ఉగ్రవాద సంస్థల కన్ను ఈ అగ్రరాజ్యంపైనే. ఫలితంగా అమెరికా కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులోభాగంగా, సరికొత్త వీసా విధానాన్ని అమలు చేయనుంది. 
 
భవిష్యత్‌లో అమెరికాకు వెళ్లాలనకునే వారు వీసా దరఖాస్తు చేస్తే ఖచ్చితంగా తమ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తదితర సామాజిక మాధ్యమాల ఖాతాల (యూఆర్ఎల్స్) వివరాలనూ అందజేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వీసా దరఖాస్తుల్లో ప్రత్యేకించి ఓ సెక్షన్‌ను జోడించాలని ఫెడరల్‌ రిజిస్టర్‌కు అమెరికా కస్టమ్స్‌, బోర్డర్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ఇటీవల ప్రతిపాదించింది. అయితే దరఖాస్తుదారులు తమ పాస్‌వర్డ్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దేశ భద్రత దృష్ట్యా ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు తమకు దర్యాప్తులో ఈ విధానం మరింత దోహదం చేయగలదని ఎజెన్సీ అధికారులు భావించి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 
 
వీసా దరఖాస్తులో సందర్శకుల సామాజిక మాధ్యమాల వివరాలను సేకరించడం ద్వారా దుష్టపన్నాగాలకు పాల్పడే వ్యక్తులను పట్టుకునేందుకు వీలవుతుందని అధికారులు అంటున్నారు. గత నవంబరులో పారిస్‌ ఉగ్రదాడి అనంతరం వీడబ్ల్యూపీ నిబంధనలను కఠినతరం చేయాలని కాంగ్రెస్‌ తీర్మానించిన నేపథ్యంలో అధికారులు ఈ ప్రతిపాదన చేయడం విశేషం. వీసాలో ఈ కొత్త విధానాన్ని నిర్ణీత కాలానికే నిర్దేశించామని, దీనిపై ఆగస్టు 22 వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలను పంపవచ్చని ఫెడరల్‌ రిజిస్టర్‌ పేర్కొంది. అదేసమయంలో ఇదే తరహా విధానాన్ని అమలు చేసే అంశాన్ని భారత విదేశాంగ అధికారులు కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుమానభూతం ప్రేమికులను మింగేసింది.. ప్రేయసిని చంపి ఉరేసుకున్న ప్రియుడు.. ఎక్కడ?