Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమెకు భజరంగీ భాయి జాన్ కావాలి...! పాక్‌లో చిక్కుకున్న యువతి..!!

ఆమెకు భజరంగీ భాయి జాన్ కావాలి...! పాక్‌లో చిక్కుకున్న యువతి..!!
, సోమవారం, 3 ఆగస్టు 2015 (07:52 IST)
భజరంగీ భాయీజాన్‌ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. పాకిస్తాన్, భారతదేశాల సరిహద్దుల్లో తప్పిపోయి ఇండియా చేరిన ఓ పాకిస్తానీ బాలికను ఆమె ఇల్లు చేర్చడం ఇతివృత్తం.. సినిమా సూపర్ సక్సెస్. కానీ, నిజంగానే భారతీయ యువతి ధీనగాథ భజరంగీ భాయిజాన్ సినిమాను తలపిస్తోంది. ఇక్కడ దేశాలు మారాయంతే... భారతీయ బాలిక పాకిస్తాన్ చేరింది. ఆమెను ఇండియా చేర్చడానికి ఓ భజరంగీ భాయి జాన్ కావాలి. అతని కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ఎదురు చూస్తోంది. ఏమిటా కథ? 
 
14 ఏళ్ల క్రితం జరిగిన ఇటువంటి యదార్థ సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తప్పిపోయింది పాక్‌ ముస్లిం అమ్మాయి కాదు. భారత్‌కు చెందిన 10 ఏళ్ల హిందూ బాలిక. ప్రస్తుతం ఆమె కరాచీలోని ‘ఈది’ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంది. ఈ సంఘటన ఎలా జరిగిందంటే... 13 ఏళ్ల క్రితం పొరబాటున ఆమె భారత్‌ నుంచి సరిహద్దు దాటి వచ్చిన ఓ పదేళ్ళ మూగ బాలికను పంజాబ్ రేంజర్స్ చేరదీశారు. తరువాత ఈది సంస్థకు అప్పగించారు. 
 
అప్పటినుంచి ఆమె ఈది సంరక్షణలోనే పెరుగుతోంది. ఆ చిన్నారికి గీత అని పేరు పెట్టారు. ప్రస్తుతం 24 ఏళ్లున్న గీత ఇక్కడి అందరికీ చాలా దగ్గరైందని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బిల్కిస్‌ ఈది వెల్లడించారు. మొబైల్‌ ఫోన్లో ఇండియా మ్యాప్‌ను చూసి గుర్తించి గీత కళ్ల నీళ్లు పెట్టుకుంటోందని.. ఆమె ఆ మ్యాప్‌లో జార్ఖండ్‌, తెలంగాణ రాష్ట్రాలను చూపిస్తోందని వెల్లడించారు. అయితే ఆమె కుటుంబ సభ్యుల గురించి ఇప్పటివరకు తెలియలేదన్నారు. 
 
తనకు ఏడుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నట్లు తెలుపుతోందన్నారు. అంతేకాక ఆమె 193 నంబర్‌ను ఎక్కువగా గుర్తిస్తోందని.. బహుశా అది ఆమె ఇంటి నంబర్‌ అయి ఉండవచ్చని భావిస్తున్నామని చెప్పారు. ఆమె కోసం తమ స్వచ్ఛంద సంస్థలో ఓ గదిని కేటాయించామని, అందులో.. హిందూ దేవతల పటాలను ఉంచామని చెప్పారు. మాజీ మంత్రి, మానవహక్కుల సంఘం నేత అన్సర్‌ బర్నే మూడేళ్ల క్రితం ఇండియా పర్యటనలో గీత అంశాన్ని లేవనెత్తారని.. ఇప్పుడు ఆమె గురించి ఫేస్‌బుక్‌లో విస్తృత ప్రచారం చేస్తున్నారని చెప్పారు. భారత రాయబార కార్యాలయం అధికారులు కూడా గీత విషయంలో ప్రయత్నాలుచేస్తున్నారన్నారు. ఆమెను తన స్వగ్రామం చేర్చడానికి పాకిస్తాన్‌లో భజరంగీ భాయీ జాన్‌గా ఎవరొస్తారో....! 

Share this Story:

Follow Webdunia telugu