Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోర్కె తీర్చలేదని సౌదీలో భారతీయ మహిళ చేతులు నరికేశారు!

కోర్కె తీర్చలేదని సౌదీలో భారతీయ మహిళ చేతులు నరికేశారు!
, శనివారం, 10 అక్టోబరు 2015 (09:06 IST)
అరబ్ దేశమైన సౌదీలో ఓ భారతీయ మహిళ చేతులు నరికివేశారు. దీనికి కారణం.. ఓ కామాంధుడి కోర్కె తీర్చలేదన్న అక్కసుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సమస్యను సీరియస్‌గా తీసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే....
 
తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల కస్తూరి మునిరత్నం అనే మహిళ సౌదీలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. ఇదే ఇంట్లో పై స్థాయి ఉద్యోగంలో మరో వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ వ్యక్తికి కస్తూరిపై కన్నుపడింది. తన కోర్కె తీర్చాలంటూ వేధించడం, చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. 
 
వీటిని భరించలేని కస్తూరి.. ఆ ఇంట్లో నుంచి ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో ఆ వ్యక్తి ఆమె చేతులు నరికివేశాడు. మూడు నెలల క్రితమే ఈమె పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ విషయం కస్తూరిని సౌదీకి పంపిన ఏజెంట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. 
 
ప్రస్తుతం ఆమె రియాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బాధితురాలిని స్వదేశానికి  తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు. 
 
కాగా, ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించలేమన్నారు. ఈ విషయాన్ని సౌదీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె చెప్పారు. ఒక భారతీయ మహిళను ఇంత దారుణంగా హింసించడం తనను చాలా కలచివేసిందని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu