Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

180 డిగ్రీ కోణంలో విమానాన్ని ల్యాండ్ చేసిన ఫోర్డ్: రియల్ హీరోనే!

180 డిగ్రీ కోణంలో విమానాన్ని ల్యాండ్ చేసిన ఫోర్డ్: రియల్ హీరోనే!
, శుక్రవారం, 6 మార్చి 2015 (19:44 IST)
హాలీవుడ్ హీరో హారిసన్ ఫోర్డ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అని నిరూపించుకున్నాడు. గతంలో ఎన్నోసార్లు సాహసోపేతంగా వ్యవహరించిన హారిసన్.. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో కూడా బుద్ధిని ఉపయోగించాడు. విమానంలో సాంకేతిక లోపం గుర్తించగానే ఏమాత్రం భయపడకుండా, ఒత్తిడికి లోనుకాకుండా విమానాశ్రయంలోని సిబ్బందిని సంప్రదించి ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. 
 
వారు అనుమతించడంతో అటువైపు మళ్లించిన ఫోర్డ్ విమానం అంతదూరం వెళ్లే అవకాశం లేదని గుర్తించి, జనావాసాలను తప్పించుకుని గోల్ఫ్ కోర్టు వైపు మళ్లించాడు. అక్కడ చెట్లకు తగిలి విమానం పేలిపోకుండా 180 డిగ్రీల కోణంలో ల్యాండ్ చేశాడు. ఇది అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని నిపుణులు ఫోర్డ్ సాహసాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
కాగా, హారిసన్ ఫోర్డ్ సినిమాల్లోనే కాదు... పలు సందర్భాల్లో నిజజీవితంలో కూడా హీరో అని నిరూపించుకున్నారు. 1966లో పైలట్ లైసెన్స్ పొందిన ఫోర్డ్ 2000వ సంవత్సరంలో టెటాన్ కౌంటీ (అమెరికా)లోని ఇడాహో ఫాల్స్ వద్ద గల పర్వతాల్లో 11,106 అడుగుల ఎత్తులో చిక్కుకున్న ఓ మహిళా పర్వతారోహకురాలిని ప్రాణాలకు తెగించి తన విమానంలో వెళ్లి రక్షించారు. 
 
2001లో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడవుల్లో తప్పిపోయిన బాలుడిని సాహసోపేతంగా రక్షించి తీసుకొచ్చారు. గతేడాది స్టార్‌వార్స్ ఏడో ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా మిలీనియం ఫెలికాన్ స్పేస్‌ క్రాఫ్ట్ తలుపు విరిగిపడడంతో తన కాలు విరిగినా లెక్క చేయకుండా, కోలుకోగానే షూటింగ్‌ను పూర్తి చేశారు. ఎనీవే హారిసన్‌ త్వరలో కోలుకోవాలని ఫ్యాన్స్‌తో పాటు మనమూ ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu