Publish Date: Fri, 06 Mar 2026 (13:00 IST)
Updated Date: Fri, 06 Mar 2026 (13:10 IST)
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ను తామే ఎంపిక చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్ అగ్రనేత అయాతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌లో మరణించిన నేపథ్యంలో, ఆయన వారసుడి ఎంపికపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఖమేనీ కుమారుడు మొజ్జబా ఖమేనీని కొత్త అధినేతగా నియమించడాన్ని తాను అంగీకరించనని స్పష్టం చేశారు. ఇరాన్ శాంతి, సామరస్యాన్ని తీసుకొచ్చే వ్యక్తి కావాలి. ఖమేనీ విధానాలనే కొనసాగించే వ్యక్తి వస్తే, మరో ఐదేళ్లలో మళ్లీ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఖమేనీ కుమారుడు ఒక పనికిరాని వ్యక్తి. వెనెజువెలాలో డెల్సీ రోడ్రిగను మధ్యంతర అధ్యక్షురాలిగా నియమించిన తరహాలోనే, ఇక్కడ కూడా నేను ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాను అని ట్రంప్ ప్రకటించారు.
మరోవైపు ఇరాన్ అధికార మార్పు తమ లక్ష్యం కాదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థ, నౌకాదళాన్ని ధ్వంసం చేయడం, అణ్వాయుధాలు లేకుండా చూడటమే తమ ఆపరేషన్ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఇదేసమయంలో ఇరాన్ చివరి చక్రవర్తి కుమారుడైన రెజా పహ్లావి తాను తాత్కాలిక నేతగా తిరిగి వస్తానని, ఆ తర్వాత ఇరాన్‌ను లౌకిక ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు కొత్త రాజ్యాంగం రూపొందించాలని ప్రతిపాదించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ కింద ఏ కొత్త నాయకుడు వచ్చినా చట్టబద్ధత ఉండదన్నారు.