చైనా, పాకిస్థాన్ దేశాలు కలిసి భారత్‌పై యుద్ధానికి వస్తాయా? భారత సరిహద్దుల్లో సైనిక బలగాల మొహరింపు సామర్థ్యం నానాటికీ పెంచడానికి కారణమేంటి? మరోవైపు పాకిస్థాన్ బలపడటం వెనుక అంతరార్థం ఏంటి? ఈ ప్రశ్నలకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం సమాధానం చెపుతోంది.
భారతదేశ సరిహద్దుల్లో చైనా సైనిక సామర్థ్యం పెరుగుతోందని, చైనా సైనిక దళాలు, స్థావరాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్నట్లు, ముఖ్యంగా పాకిస్థాన్‌లో బలపడుతున్నట్లు తెలిపింది. ప్రజా గణతంత్ర చైనాకు సంబంధించిన సైనిక, భద్రత పరిణామాలపై పెంటగాన్ 2016వ సంవత్సరానికి రూపొందించిన నివేదికను అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించింది.
అయితే, చైనా వైఖరి వెనుకనున్న అసలు ఉద్దేశాన్ని చెప్పడం కష్టమని పెంటగాన్ పేర్కొంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌లో చైనా స్థావరాలు, బలగాలు పెరుగుతున్నాయని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది.
పాకిస్థాన్‌తో చైనాకు దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా చైనా ఆర్థిక ప్రయోజనాలు విస్తరిస్తుండటంతో సుదూర సముద్రాల్లో చైనా నావికాదళం సేవలు అవసరమని భావిస్తోందని పేర్కొంది.