పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఐదురోజులుగా జరుగుతున్న హింసలో 58 మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. హింసను అదుపు చేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం భారీ స్థాయిలో అదనపు పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపింది.
ఆఫ్ఘనిస్థాన్‌కు సరుకుల రవాణా చేయడానికి నాటో వినియోగించుకుంటున్న ఈ పోర్ట్ సిటీలో తెగల మధ్య జరుగుతున్న హింసను అదుపు చేయడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత నెలలో ఈ నగరంలో 200 మంది పైగా చనిపోయారు. 1995 తర్వాత చోటుచేసుకున్న ఈ హింసకు కారణమైన వారి అరెస్ట్‌కు సహకరించిన వారికి పది మిలియన్ రూపాయల నగదు ఇస్తామని స్థానిక అధికారులు ప్రకటించారు.
కరాచీలో పరిస్థితిని చర్చించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. నేరస్థులను కోర్టుకు ఈడ్చడంలో సహకరించాలని కరాచీలోని రాజకీయ పార్టీలకు జర్దారీ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 17 మిలియన్ల జనాభా గల కరాచీ పాకిస్థాన్‌లో అతిపెద్ద నగరం. 1980,1990ల్లో కూడా ఈ నగరంలో తెగల మధ్య హింస జరిగింది.