2009 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రముఖ రుమేనియా రచయిత్రి హెర్టా ముల్లర్‌కు దక్కింది. జర్మన్ సంతతికి చెందిన హెర్టా ముల్లర్ కమ్యూనిస్టు నియంతృత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలకు అక్షరూపం ఇచ్చారు. దీనికి గుర్తింపుగా ఆమెకు ఈ యేడాది నోబెల్ బహుమతిని ప్రకటిస్తున్న రాయల్ స్వీడిష్ అకాడమీ గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
1976 సంవత్సరంలో సాహిత్యంలో డిగ్రీని పొందిన ముల్లర్.. ఒక కంపెనీలో అనువాదరాలిగా చేరింది. ఆ సమయంలో రుమేనియా రహస్య పోలీసు విభాగం కార్యాలయాన్ని విమర్శించినందుకు గాను ఆమె ఉద్యోగం నుంచి తొలగించారు. ముల్లర్ అప్పటి నుంచి నియంతృత్వాన్ని విమర్శిస్తూ రచనలు సాగించసాగారు.
1982 సంవత్సరంలో ఆమె జర్మన్ జాతి ప్రజల కష్టనష్టాలను కళ్లకుకడుతూ రాసిన తొలి కథా సంపుటి "నీడెరూంజెన్" ముద్రితమైంది. అయితే, దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. అయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా, ప్రభుత్వాలు పలు రకాల ఆంక్షలు విధించినప్పటికీ ఆమె మాత్రం అకుంఠిత దీక్షతో తన రచనలను మాత్రం కొనసాగించి, అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు.