అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నల్లజాతి సూరీడు బరాక్ ఒబామాకు నోబెల్ పురస్కారం దక్కడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అసలు ఆయన ప్రపంచానికి లేదా అమెరికాకు ఏం చేశారని ఈ అవార్డుకు ఎంపిక చేశారని అవార్డు కమిటీని కోట్లాది మంది ప్రపంచ వాసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయనకు దక్కిన నోబెల్ బహుమతి బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా పరిగణిస్తున్న నోబెల్ బహుమతి ఆయనకు ఎలా, ఎందుకు వరించినట్లు? అనే సందేహాలు పలువురిని వెంటాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు ఓ సాదాసీదా రాజకీయ నేత. ఆ తర్వాత ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న మాట వాస్తవమే. ఇందుకే ఆయనకు నోబెల్ పురస్కారం అందజేయాలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రధానంగా.. తమ దేశ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాదులను క్రూరంగా హింసించరాదని ఆదేశించారు. అలాగే, గ్వాంటెనామా అమెరికా మిలటరీ జైలు 2010నాటికి మూసివేయాలని తలపెట్టారు. ఇరాక్ యుద్ధాన్ని ముగిస్తానని, 2012 నాటికి అమెరికా సైనిక బలగాలను ఇరాక్ నుంచి సంపూర్ణంగా వెనక్కి పిలిపిస్తామని ప్రకటించారు.
మరోవైపు ఇజ్రాయేల్, పాలస్తీనా శాంతి కోసం ఆయన పిలుపు ఇచ్చారు. అయితే, ఈ రెండు దేశాలు ఆయన పిలుపును ఏమాత్రం ఖాతరు చేయలేదు. మరోవైపు.. ఇరాన్ అగ్రదేశంతో పాటు.. ప్రపంచ దేశాల ఆదేశాలు బేఖాతర్ చేస్తూ యధేచ్చగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది.
అలాగే, అణ్వస్త్ర రహిత ప్రపంచం కోసం పిలుపునిచ్చిన ఒబామా.. తమవద్దనే వందల సంఖ్యలో అణ్వస్త్రాలను నిల్వవుంచుకోవడం గమనార్హం. ఇలా కేవలం ప్రకటనలు చేసినందుకే ఒబామాకు నోబెల్ శాంతి బహుమతిని కట్టబెట్టారా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.