థాయ్‌లాండ్ దేశ కొత్త ప్రధానమంత్రిగా యింగ్లక్ షినవత్రాను ఆదేశ పార్లమెంట్ ఎన్నుకుంది. థాయ్‌లో సుమారు ఐదేళ్ల రాజకీయ సంక్షోభం అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన విషయం తెల్సిందే. ప్రధానిగా యింగ్లక్ అభ్యర్థిత్వాన్ని ఆ దేశ పార్లమెంట్ ధ్రువీకరించింది. దిగువ సభలో మొత్తం 500 మంది సభ్యులుండగా షినవత్రాకు 296 మంది సభ్యులు మద్దతు తెలిపారు.
కాగా, సైనిక కుట్ర నేపథ్యంలో దేశం విడిచిపోయిన మాజీ ప్రధాని థక్సిన్ షినవత్రాకు సోదరి అయిన యింగ్లక్ గత నెలలో జరిగిన ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ప్యూ థాయ్ పార్టీని విజయంబాటలో నడిపించారు. రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశంలో సుస్థిరత తీసుకువస్తానన్న వాగ్దానంతో ఆమె ఎన్నికల్లో గెలిచారు.
పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ముగ్గురు ఎంపీలు ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేయగా, 197 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రతిపక్షం తరపున ప్రధానమంత్రి పదవికి ఎవరూ పోటీకి దిగలేదు. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన యింగ్లక్ 44 ఏళ్ల వయసులోనే ప్రధాని పదవిని దక్కించుకోవడం గమనార్హం.