Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒబామా హైటెక్ పాలసీ ఛీఫ్‌గా సోనాల్ షా

ఒబామా హైటెక్ పాలసీ ఛీఫ్‌గా సోనాల్ షా
, గురువారం, 20 నవంబరు 2008 (17:05 IST)
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా విధాన కార్యాచరణ బృందంలో ప్రవాస భారీతీయురాలు సోనాల్ షాకు అత్యున్నత పదవి లభించింది. ప్రముఖ ఆన్‌లైన్ సెర్చ్ఇంజిన్ గూగుల్‌ సంస్థలో కీలక పదవి నిర్వహిస్తున్న సోనాల్ షాను అమెరికా నూతన అధ్యక్షుడికి హైటెక్ విధానంలో ప్రాధాన్యతలను నిర్ణయించే బృంద నేతగా ఎన్నుకున్నారు.

ఒబామా, బైడన్‌లు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను నిర్వహించే కాలంలో పలు విధాన కార్యాచరణ బృందాలు అమెరికా విధానాలకు సంబంధించిన పలు అంశాలను రూపొందించి అధ్యక్షుడికి సమర్పిస్తుంటాయి. ఆర్థికవ్యవస్థ, విద్య, ఇంధనం, పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, వలసవిధానం, జాతీయ భద్రత, టెక్నాలజీ, సృజనాత్మక ఆవిష్కరణ, ప్రభుత్వం సంస్కరణ వంటి అంశాలపై ఈ కార్యాచరణ బృందాలు దృష్టి పెడతాయని ఒబామా పరివర్తనా బృందం ఓ ప్రకటనలో తెలిపింది.

ఒబామా ఇంతవరకు టెలికాం పరిశ్రమకు సంబంధించిన ఇద్దరు ప్రముఖులను, గూగుల్ ఫిలాంథ్రఫీ అధినేత్రి సోనాల్ షాను తనకు హైటెక్ విధానంలో ప్రాధాన్యతల గురించి సలహా ఇచ్చే బృందంలో నియమించారు.

గూగుల్.ఆర్గ్ సంస్థలో అంతర్జాతీయ అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించి గూగుల్ ఫిలాంథ్రపీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సోనాల్ అంతకుముందు గోల్డ్‌మన్ సాచ్ అండ్ కో ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. పైగా ఇండియా కార్ప్స్ అనే అమెరికాకు చెందిన ఎన్జీఓ సంస్థ సహ సంస్థాపకురాలిగా కూడా సోనాల్ పని చేశారు.

ప్రవాస భారతీయురాలైన సోనాల్ షా 1995-2002 మధ్య కాలంలో అమెరికా ట్రెజరీ విభాగంలో పలు ఆర్థిక పరమైన అంశాలపై పనిచేశారు. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఒబామా-బైడెన్ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్ సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.

ఒబామా పాలనలో ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఎవరిని నియమిస్తారనే విషయంలో పలువురిలో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో సోనాల్ షాతో పాటు, టెలికాం పరిశ్రమ ప్రముఖులు జూలియస్ గెనోచోవిస్కీ, బ్లెయిర్ లెవిన్‌లను టెక్నాలజీ బృందంలో నియమించారు. ఒబామా పాలనా యంత్రాంగంలో హైటెక్ రంగానికి నేతృత్వం వహించే వ్యక్తి అమెరికా ప్రభుత్వంలో టెక్నాలజీ విభాగాన్ని నియంత్రించే స్థాయిలో ఉంటారు.

కాగా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, వాషింగ్టన్ పాలనా వ్యవహారాలను సంస్కరించి, మన కాలపు పెను సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కొత్తగా నియమించబడిన బృంద సభ్యుల విస్తృత అనుభవాలు తమకు ఎంతో ఉపకరిస్తాయని తాను ఆశిస్తున్నట్లుగా ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu