భారత దేశ వాణిజ్య రాజధాని ముంబైపై దాడులకు పాల్పడిన తీవ్రవాద సంస్థలపై చర్య తీసుకోవాల్సిందేనని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ స్పష్టం చేశారు. ఈ సంస్థల కార్యకలాపాలను తమ భూభాగంలో సాగనివ్వకుండా, వాటిని మూసేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఖురేషీ మాట్లాడుతూ.. ముంబైపై దాడులకు పాల్పడిన తీవ్రవాద సంస్థలు తమకు మిత్రులు కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
ఆసియా ఖండంలోనే కాకుండా, తమ దేశంలో శాంతి స్థాపన, జఠిల, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఇరుగు పొరుగు దేశాలతో స్నేహపూర్వక చర్చలు జరపాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఉగ్రవాద సంస్థలకు తమ దేశం నుంచి ఎలాంటి రాజకీయ, భౌతిక సహాయాన్ని చేయబోమని ఆయన స్పష్టం చేశారు. పాక్ కూడా తీవ్రవాద బాధిత దేశమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఖురేషీ విజ్ఞప్తి చేశారు.