ఆస్ట్రేలియాలో మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. మెల్‌బోర్న్ నగరంలో గడిచిన పక్షం రోజుల్లో ఓ భారతీయ విద్యార్థిపై దాడి జరగడం ఇది రెండోసారి. కాగా గత నెల రోజుల్లో ఆస్ట్రేలియావ్యాప్తంగా భారతీయులపై జరిగిన 11వ దాడి ఇది. తాజాగా మెల్‌బోర్న్‌లో కొందరు యువకులు 23 ఏళ్ల ఓ భారతీయ విద్యార్థిని తీవ్రంగా కొట్టారు.
మెల్‌బోర్న్ శివారుల్లో జరిగిన ఈ దుశ్యర్యలో కమల్ జిత్ అనే భారతీయ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహ కోల్పోయి, రక్తపు మడుగులో ఉన్న ఈ యువకుడిని మరో భారతీయ విద్యార్థి గుర్తించాడు. కమల్ జిత్‌పై ఇప్పటికే ఒకసారి దాడి జరగడం గమనార్హం. ఇంతకుముందు నగర పశ్చిమ శివారుల్లోని సెయింట్ అల్బేన్స్ స్టేషన్‌లో చివరి రైలు దిగి వస్తున్న జిత్‌పై ముసుగుల్లో వచ్చిన కొందరు యువకులు గ్రుడ్లు విసిరారు.
ఇదిలా ఉంటే తాజా దాడిపై జిత్ "ది ఏజ్" వార్తాపత్రికతో మాట్లాడుతూ.. స్వదేశానికి, సొంతవాళ్లకు చాలా దూరంగా, చాలా డబ్బు వెచ్చించి ఇక్కడ ఉంటున్నాం. తమపై ఇటువంటి దాడులు జరగడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. తమకు ఇక్కడ రక్షణ లేదన్నాడు. గత రాత్రి 1.40 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కారులో అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని పట్టించుకోకుండా వచ్చేందుకు ప్రయత్నించాను. పిజ్జా షాపుకు సమీపంలో ఇద్దరు వ్యక్తులు కారులో నుంచి బయటకు వచ్చారు. ఇంకొక వ్యక్తి కారులో వేచివున్నాడు. బయటకు వచ్చిన ఇద్దరు వ్యక్తును తనను కిందపడేసి, తలపై స్టీలు రాడ్డుతో కొట్టారని జిత్ చెప్పాడు. జిత్‌కు ఏడు కుట్లు పడ్డాయి.
ఈ దాడి అనంతరం శివారుల్లో ఉండాలనుకోవడం లేదని జిత్ ఈ వార్తాపత్రికతో చెప్పాడు. గత వారం రోజుల్లో భారతీయులపై జరిగిన ఐదు లేదా ఆరో దాడి ఇదని జిత్ స్నేహితులు తెలిపారు. శివారు ప్రాంతాల్లో అదనపు పోలీసులను మోహరించాలని ఆస్ట్రేలియా అధికారిక యంత్రాంగాన్ని వారు డిమాండ్ చేశారు.