భూకంపం, సునామీలతో ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌లో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా అణు సాంకేతికత నుంచి దేశం మరో రూపంలో విపత్తును ఎదుర్కొంటున్న నేపథ్యంలో జపాన్‌లోని హిరోషిమా నగరం 66 సంవత్సరాల క్రితం జరిగిన అణు బాంబు దాడి విషాద ఘట్టాలను గుర్తుకు తెచ్చుకుంది.
ప్రపంచంలో తొలి అణు బాంబు దాడిని ఎదుర్కొన్న ప్రాంతం హిరోషిమా నగరం. రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో అమెరికా 1945 ఆగస్ట్ 6వ తేదీన అణు బాంబు దాడి జరిగిన ప్రదేశానికి హిరోషిమా వాసులు చేరుకుని సరిగ్గా ఉదయం 8.15 గంటలకు ఒక నిమిషం పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
హిరోషిమాపై జరిగిన ఈ బాంబు దాడిలో నగరం మొత్తం ధ్వంసం కాగా 1,40,000 మంది మరణించారు. ఆగస్ట్ 9వ తేదీన నాగసాకిపై జరిగిన రెండో అణు బాంబు దాడిలో పదివేలమందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. తీవ్రంగా నష్టపోయిన జపాన్ అమెరికా ముందు మోకరిల్లింది. జపాన్ ప్రధాన మంత్రి నొయోటో కన్ శనివారం హిరోషిమా శాంతి స్మారక పార్క్ వద్ద పచ్చని పుష్ఫాలను ఉంచి మృతులకు నివాళులు అర్పించారు.