Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసీస్ ఓపెన్‌లో నాదల్ మూడో గెలుపు: "రఫా"డిస్తాడా..!?

ఆసీస్ ఓపెన్‌లో నాదల్ మూడో గెలుపు:
, గురువారం, 20 జనవరి 2011 (14:37 IST)
PTI
మెల్‌బోర్న్ నగరంలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్‌సీడ్, స్పెయిన్‌బుల్ రఫెల్ నాదల్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అమెరికన్ క్వాలిఫైయర్ రియాన్ స్వీటింగ్‌తో రెండో రౌండ్లో తలపడిన రఫెల్ నాదల్, 6-2, 6-1, 6-1 తేడాతో గెలుపును నమోదు చేసుకున్నాడు.

టాప్- ర్యాంకర్ అయిన రఫెల్ నాదల్.. గత ఏడాది యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్, ఓపెన్, వింబుల్డన్ టెన్నిస్ టైటిళ్లను నెగ్గాడు. ఇదే జోరుతో ఈ ఏడాది టెన్నిస్ సీజన్‌లో తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకోవాలని రఫెల్ నాదల్ తహతహలాడుతున్నాడు. అంతేగాకుండా ఆసీస్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకుని వరుసగా నాలుగు టైటిళ్లు సాధించిన క్రీడాకారుడిగా రికార్డు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

కాగా.. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఒకే క్రీడాకారుడు వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ 42 సంవత్సరాలైంది. చివరిసారి 1969లో ఆస్ట్రేలియా దిగ్గజం రాడ్ లేవర్ ఈ ఘనత సాధించాడు. ఆ ఏడాది సీజన్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకుని లేవర్ 'క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్' సాధించాడు.

సుదీర్ఘ విరామం తర్వాత లేవర్ సాధించిన క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ తరహాలో కాకపోయినా, ఏకకాలంలో అన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నిలబెట్టుకున్న క్రీడాకారుడిగా ప్రపంచ నెంబర్ వన్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

2010లో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్న నాదల్, ఆసీస్ ఓపెన్‌లోనూ గెలిచి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన క్రీడాకారుడిగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఫెదరర్, ముర్రే, జకోవిచ్‌లకు గట్టిపోటీ తప్పదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రఫెల్ నాదల్ రఫాడించి గ్రాండ్‌స్లామ్ నెగ్గుతాడో లేదో వేచి చూడాల్సిందే..!

Share this Story:

Follow Webdunia telugu