భావిపౌరులంటే తనకు ఎనలేని ప్రేమని నటి నవనీత్ కౌర్ చెబుతోంది. చిన్నతనంలో తను చదువుకున్న ముంబై కార్తీక్ హైస్కూల్‌లో జరుపుకున్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను గుర్తుచేసుకుంది. ఆగస్టు 15న జాతీయగీతం ఆలపించి పిల్లలందరూ చాక్‌లెట్లను పంచేవారని, అసలైన దేశభక్తి పిల్లల్లోనే వ్యక్తమవుతుందని అనుభవపూర్వకంగా కౌర్ చెబుతున్నారు.
పెద్దవారయ్యాక చాలామంది పంద్రాగస్టును మర్చిపోతుంటామని, చిన్నతనంలో చేసినట్లుగా రకరకాల కారణాలరీత్యా చేయలేకపోతున్నందుకు బాధ కలిగిస్తోందన్నారు. కానీ ఎక్కడ ఉన్నా... ఆరోజు మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన శాంతిదూత మహాత్మా గాంధీని తలచుకుంటానని చెప్పారు.
తాను హీరోయిన్ అయిన తర్వాత తను చదువుకున్న పాఠశాలకు స్పెషల్ గెస్ట్‌గా వెళ్ళిన వైనాన్ని ఇంకా మర్చిపోలేనని పేర్కొన్నారు. నటిగా మారిన తర్వాత పిల్లల కోసం ఓ ఛారిటీ స్థాపించాలనే ఆలోచన వచ్చిందని, త్వరలో కార్యరూపం దాల్చనున్నట్లు చెప్పుకొచ్చారు.
పేద విద్యార్థులకు ఛారిటీ ద్వారా సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. అగ్రహీరో బాలకృష్ణ సరసనకూడా నటించిన నవనీత్ కౌర్ ప్రస్తుతం "కాలచక్రం" చిత్రంలో ప్రధాన భూమిక పోషిస్తుంది.