Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత స్వాతంత్ర్యోద్యమంలో నెత్తుటి మరకలు

భారత స్వాతంత్ర్యోద్యమంలో నెత్తుటి మరకలు
రౌలట్ చట్టం ద్వారా 1919 సంవత్సరంలో సంస్కరణ తాలూకూ సత్ఫలితాలు తీవ్రంగా అణచివేయబడ్డాయి, "పాలకులపై ధిక్కార కుట్ర"ను పరిశోధించే నిమిత్తం నియమించబడిన రౌలట్ సంఘం రాచరిక శాసన మండలికి నివేదించిన ప్రతిపాదనల అనంతరం రౌలట్ చట్టం అమలులోకి వచ్చింది. చట్టం ద్వారా వైస్రాయ్ ప్రభుత్వానికి విశేషాధికారాలు సంప్రాప్తించాయి.

చట్టాన్ని ఆసరాగా తీసుకున్న ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు ఆంక్షలు, ఎలాంటి విచారణ లేకుండానే రాజకీయ కార్యకలాపాలపై నిషేధం, ముందస్తు వారంటు లేకుండానే రాజద్రోహం వంకతో వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించింది. దీంతో రౌలట్ చట్టాన్ని ప్రజలు నిషేధిత చట్టంగా పిలవడం ప్రారంభించారు. చట్టం పట్ల ప్రజలలో నిరసన జ్వాలల జాతియావత్తూ వ్యాపించాయి. దేశంలో అక్కడక్కడా నిరసనోద్యమాలు హర్తాళ్ల రూపంలో ఆరంభమయ్యాయి.

ప్రజల నిరసనను తీవ్రంగా అణిచివేసే దుష్ట పన్నాగానికి 1919 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లోగల జలియన్‌వాలా బాగ్ వేదికగా మారింది. జలియన్‌వాలా బాగ్ సామూహిక సంహారానికి ( దీనినే అమృత్‌సర్ సామూహిక సంహారమని చరిత్రకారులు చెపుతారు ) నాయకత్వం వహించిన జనరల్ రెగినాల్డ్ డయ్యర్ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో నెత్తుటి మరకలు అంటించిన దురహంకార బ్రిటీష్ జనరల్‌గా మిగిలిపోయాడు.

ఆరోజు...
ఏప్రిల్ 13వతేదీ, 1919వ సంవత్సరం...
మృత్యువు తన భీకర పదఘట్టనలతో భరతమాతకు దాస్యశృంఖలాలను ఛేదించాలనే కాంక్షతో సమావేశమైన ప్రజలపై విరుచుకుపడింది. జలియన్‌వాలా బాగ్‌లో పసివాళ్లతో సహా సమావేశానికి వచ్చిన ప్రజలపై ముష్కర బ్రిటీష్ సైనిక కమాండర్ అయిన బ్రిగేడియర్-జనరల్ రెగినాల్డ్ డయ్యర్ కన్నుపడింది.

అంతే... జలియన్‌వాలా బాగ్ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మూసివేయమని సైనికులను డయ్యర్ ఆదేశించాడు. ఆ సమయంలో ఊహించని రీతిలో 5,000 మంది ప్రజలు జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమై ఉన్నారు. బ్రిటీష్ రాణి మెప్పును పొందేందుకు ఇదే సదవకాశమని భావించిన డయ్యర్, ప్రజలపై కాల్పులు జరపమని కరడుగట్టిన ఆదేశాన్ని సైనికులకు జారీ చేసాడు.

హఠాత్తుగా చుట్టుముట్టిన సైనికులను, వారి చేతుల్లో ఎక్కుపెట్టిన తుపాకులను చూసిన ప్రజలలోని మహిళలు, వృద్ధులు కాల్పులకు సిద్ధమై ముందువరుసలో వచ్చి నిలిచారు. ప్రజల చర్యకు హతాశులైన సైనికులు తుపాకీలను ప్రయోగించడానికి వెనుకాడుతుండగా కాల్పులు జరపమని డయ్యర్ మరోసారి హూంకరించాడు.

అంతే... మానవ సంహారం మొదలైంది... 1650 రౌండ్లకు పైగా తూటాలు ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నాయి. తూటాల బారినుంచి తప్పించుకునేందుకు అనేకమంది ప్రజలు బాగ్‌లోని బావిలో దూకి విగతజీవులయ్యారు. బాగ్‌ ప్రహరీ గోడనెక్కి ఆవలకు దూకి ప్రాణాలను కాపాడుకోవాలనుకున్న ప్రజలపై కర్కశ తూటాలు వేటాడి, వెంటాడి మరీ చంపాయి.

గోడను తాకిన తూటాల ఆనవాళ్లు అలనాటి మానవ సంహారానికి సాక్షిగా ఈనాటికి కనిపిస్తాయి. జలియన్‌వాలా బాగ్ విషాదంలో 379 మంది ప్రజలు మృతి చెందగా, 1,137 మంది గాయపడ్డారని అధికారక లెక్కలు చెపుతుండగా, అనధికారిక అంచనాలను అనుసరించి 1000 మందికి పైగా ప్రజలు మృతి చెందారు.

డయ్యర్ కుటిలరాజనీతికి బలైపోయిన ప్రజలు తమ త్యాగంతో దేశ ప్రజలలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించి, స్వేచ్ఛాభారతావని ఆవిష్కారంలో అమరులుగా మిగిలిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu