Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవిందా... రూ. 20 కోట్లు పోయిందా..!! తిరుమలలో తగ్గిన ఆదాయం

గోవిందా... రూ. 20 కోట్లు పోయిందా..!! తిరుమలలో తగ్గిన ఆదాయం
, శనివారం, 28 మార్చి 2015 (13:01 IST)
తిరుమలకు ఒక్కొక్క అధికారి వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తారు. వీరి విధానాలతో తిరుమల తిరుపతి దేవస్థానానికి నష్టం వస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఎలుక దూరిందని వెనుకటికి ఒకరెవరో ఇంటికే నిప్పు పెట్టారట. అలాగే ఉంది టీటీడీ వ్యవహారశైలి. ప్రత్యేక దర్శనం టికెట్ల జారీలో దళారీల హావా పెరిగిపోతోందని భావించి ఆన్ లైన్ చేసి చేతులు కాల్చుకుంది. దాదాపుగా రూ. 20 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. కేవలం తిరుమలలోని ఒకే ఒక అధికారి ఆలోచన కారణంగానే ఈ నష్టాన్ని టీటీడీ భరించాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.
 
తిరుమలలో బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు లభించని భక్తుల కోసం,  ఓ మోస్తరు విఐపిలను సంతృప్తి పరచడానికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఈవోగా ఉన్నప్పుడు శీఘ్రదర్శనాన్ని ప్రవేశపెట్టారు. ఆపై దానినే ప్రత్యేక దర్శనంగా మార్చారు. కనీసం పది వేల నుంచి రద్దీని అనుసరించి టికెట్లు జారీ చేసేవారు. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ ఎత్తున ఆదాయం పెరిగింది. ఇదే విధానం వలనం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 190 కోట్ల ఆదాయం వచ్చింది. పైగా బ్రేక్ దర్శనాల ఒత్తిడి తగ్గింది. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయన సిఎస్ గా నియమితులయ్యారు. అంతకు మునుపే ఆయన స్థానం ఎంజి గోపాల్ ఈవో గా విచ్చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. 
 
అయితే తిరమలలోని ఓ అధికారి వచ్చే సిఫార్సుల సంఖ్య తగ్గింది. తన పరపతి తగ్గుతోందని గ్రహించిన అధికారి ప్రత్యేక దర్శనానికి మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన ఈ ప్రత్యేక దర్శనాన్ని ఎత్తేస్తే విమర్శల పాలు కాకతప్పదనే  ఉద్దేశ్యంతో దళారుల పేరు చెప్పి మెల్లగా దానిని ఆన్ లైన్ వైపునకు మార్చారు. విడతల వారిగా ప్రత్యేక దర్శనం టికెట్లను పోస్టాఫీసుల్లో, టీటీడీ ఆన్ లైన్ సెంటర్లలో కూడా పెట్టారు. అయితే వారు జారీ చేసిన టికెట్లు పూర్తి స్థాయిలో అమ్ముడుపోలేదు. 
 
సాధారణంగా కరెంట్ బుకింగ్ ఉన్నప్పుడు భారీ ఎత్తున క్యూ ఉండేది. వేలాది మంది ఇక్కడకు చేరుకునే వారు. గత ఆర్థిక సంవత్సరంలో 63.5 లక్షల మంది జనం ఈ విధానాన్ని వినియోగించుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే ప్రత్యేక దర్శనాన్ని ఆన్ లైన్ చేసి కరెంట్ బుకింగ్ ఎత్తివేయడం వలన 56 లక్షల మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. అంటే కనీసం 6.6 లక్షల మంది తగ్గారు. ఈ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక దర్శనం ద్వారా కేవలం రూ. 170 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. అంటే ఇక్కడ రూ. 20 కోట్ల నష్టం వాటిల్లింది. 
 
కేవలం ఒక అధికారి పలుకుబడి, పరపతి కోసం ప్రత్యేక దర్శనంపై ప్రయోగాలు చేసి టీటీడి చేతులు కాల్చుకుంది. ప్రత్యేక దర్శన ప్రభావం ఇటు కళ్యాణ కట్టపై కూడా పడింది. తలనీలాల ద్వారా టీటీడీకి గత యేడాది రూ.220 కోట్లు ఆదాయం రాగా ఈ యేడాది అది రూ.200 కోట్లకు పడిపోయింది. అంటే ప్రత్యక్షంగా రూ. 20 కోట్లు పరోక్షంగా మరో రూ.20 కోట్ల ఆదాయానికి గండి పడింది. 

Share this Story:

Follow Webdunia telugu