Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తులసి ఆకులతో అవిరి పడితే... తులసి పొడితో పళ్లు తోముకుంటే...

తులసి ఆకులతో అవిరి పడితే... తులసి పొడితో పళ్లు తోముకుంటే...
, ఆదివారం, 20 మార్చి 2016 (16:11 IST)
పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చనే మాటలు అక్షర సత్యాలనవచ్చు. ఎందుకంటే తులసిలో ఉండే ఔషద గుణాలు సకల రోగాలను నివారిస్తాయి కాబట్టి. ఆరోగ్యపరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. లక్ష్మి తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా పిలువబడే ఈ తులసి వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకుందామా..?!
 
మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో తయారు చేసిన కషాయం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా మంచి ప్రభావం కనిపిస్తుంది. ఇలా చేయడాన్నే ఆరోమా థెరపీ అంటారు.
 
నీడన ఆరబెట్టిన తులసి ఆకులను పొడి చేసి, ఒక టీస్పూన్ పొడికి, చిటికెడు సైంధవలవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి.
 
తులసి ఆకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి. తులసి ఆకుల కషాయం జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది.
 
తులసి కషాయంలో ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే, జ్వరంతో బాధపడేవారి అధిక దాహం సమస్యను నివారిస్తుంది. వీటి ఆకులతో అవిరి పడితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి కషాయం, అల్లం రసం సమపాళ్ళలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
 
ఏడాది నిండిన పిల్లలకు రోజూ ఒక చెంచా తులసి రసం తాగిస్తే జీర్ణ శక్తి పెరుగుతుండి. పిల్లలకు తరచూ జలుబు, దగ్గు, జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు. కళ్ళు మండుతున్నా, ఎరుపెక్కినా కషాయం పలుచగా చేసి కళ్ళు కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu