Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాహితీ సవ్యసాచి, కవి చిరంజీవి "తిలక్"

సాహితీ సవ్యసాచి, కవి చిరంజీవి
FILE
"'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు"...

సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి...

అంటూ.. వచన కవిత్వానికి జిగిని, బిగిని ఒక గుర్తింపును కల్పించి తనదైన శైలిని సమకూర్చుకున్న మేటికవి బాలగంగాధర తిలక్‌. భావకవితలో పుట్టి అభ్యుదయ కవిత మీదుగా అనుభూతి కవితా ప్రస్థానం సాగించిన నవకవితా యాత్రికుడీయన. ఈయన కవిత్వం.. మానవత్వం, అభ్యుదయం కలగలిసిన మిశ్రమ రూపం.

తిలక్ అంటేనే "అమృతం కురిసిన రాత్రి' గుర్తుకొస్తుంది. ఆ కవితలోని నవత గుర్తుకొస్తుంది. నువ్వు లేవు నీ పాట ఉందంటూ... కన్నీటి జడులలో తడిసిన దయాపారావతాలుగా ఆయన అక్షరాలు మనముందు నిలుస్తాయి. నిశ్శబ్ద నదీతీరాన్ని పలకరించే శుక్తిగత మౌక్తికంలాగా ఆయన చూపిన ప్రేమైక మూర్తి దర్శనమిస్తుంది. తన రచనలతో తెలుగు కవిత్వగతిని మార్చిన ఈ మహనీయుడి జన్మదినం నేడే..! ఈ సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ....
గాలి మూగదయి పోయింది
గాలి మూగదయి పోయింది పాట బూడిదయి పోయింది వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి నభీస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి.... అంటూ తిలక్ మరణం తరువాత మహాకవి శ్రీశ్రీ స్మృతిగీతం రచించారు...
webdunia


ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు దగ్గర 1921వ సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన దేవరకొండ బాలగంగాధర తిలక్ జన్మించారు. ఆయన తండ్రి సత్యనారాయణగారికి, "లోకమాన్య బాలగంగాధర తిలక్"పై ఉన్న అభిమానంతోనే మన తిలక్‌కు బాలగంగాధర తిలక్‌గా ఆ నామకరణం చేశారు. తణుకుకు చెందిన పెన్మెత్స సత్యనారాయణరాజు తిలక్‌కి గురువు. ఆయన వద్దనే ఛందస్సు, వ్యాకరణం, ప్రబంధాలను ఈయన నేర్చుకున్నారు.

తిలక్ ఎంత సుకుమారుడో ఆయన కవిత అంత నిశితమైనది. భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం వుంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం.

అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడాని వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.

మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి తిలక్ కవితను, కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నారు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు... బిచ్చగాళ్ళు, అనాధులు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తేలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టాడు.

మొదట కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ, తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ, కవిత్వం రాశినా... వచన కవితా ప్రక్రియని తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖుడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన ఈయన కవిత్వం అభ్యుదయ, భావ కవిత్వాల కలబోత. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చారు.

వచన కవితా నిర్మాణ శిల్పరహస్యవేది అయిన తిలక్‌ నలబై అయిదేళ్ల నడిప్రాయంలో 1966వ సంవత్సరం జులై 2వ తేదీన 45 సంవత్సరాలకే అనారోగ్యంలో అసువులుబాసారు. మంచి అందగాడు, మానసికంగా మెత్తనివాడు, స్నేహశీలి, కవి, రసజ్ఞుడు అయిన తిలక్ అలా భౌతిక ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరమయ్యారు.

తిలక్ మరణం తరువాత మహాకవి శ్రీశ్రీ ఆయనకు నివాళులర్పిస్తూ....

"గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
నభీస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి...." అంటూ స్మృతిగీతం రచించారు.

ప్రభాతము-సంధ్య, గోరువంకలు, సుశీలపెళ్ళి, సుప్తశిల, సాలెపురుగు, సుచిత్రపరిణయం, అమృతం కురిసిన రాత్రి మొదలైనవి తిలక్‌ రచనలు. తిలక్ మరణం తరువాత ఆయన రాసిన వచన కవితలు "అమృతం కురిసిన రాత్రి"గా ప్రచురింపబడింది. కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి, ఉత్తమ కవితాసంపుటిగా 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందింది.

"అమృతం కురిసిన రాత్రి' గురించి ఆచార్య జీవియస్‌ మాటల్లో.... "ఏం చెప్పాలి' అన్న వస్తు స్పృహను జీవితమంతా పరచి "ఎలా చెప్పాలి' అన్న శిల్పస్పృహను కావ్యజీవితమంతా నిరిపన ఖండకావ్య ప్రక్రియ అది. అది అమృతం తాగిన ప్రక్రియ, అని ఎంతో విలువైన వివేచనాత్మకమైన ప్రకటన అని అన్నారు.

తిలక్‌ కవిత్వానికి అసలు రూపం "అమృతం కురిసిన రాత్రి". దీంట్లోని ప్రతి కవిత కొత్త శిల్పంతో, కొత్త భావంతో రక్తి కట్టిస్తుంది. హృదయాన్ని కదిలిస్తుంది. మెదడుకి పదును పెడుతుంది. భావ తీవ్రతతో పాఠకులలో ఒకవిధమైన మానసికావస్థను కలిగించిన మహనీయుడు తిలక్. మన లోలోపల జరిగే ఒకానొక అనుభూతి విశిష్టతే కవిత్వానికి ఆధారం అని ప్రకటించిన తిలక్ కవితాజ్ఞానిగా చరిత్రలో చిరస్థాయిగా ఎల్లప్పుడూ నిలిచే ఉంటారు.

Share this Story:

Follow Webdunia telugu