Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాళునికి కలిసొచ్చిన అమావాస్య

కాళునికి కలిసొచ్చిన అమావాస్య
, సోమవారం, 5 నవంబరు 2007 (20:24 IST)
"ఏమండీ, కాళుడు వచ్చాడు".
బెల్ మోగగానే తలుపు తీసిన మా శ్రీమతి తలుపు అవతల ఉన్న కాళేశ్వరరావు ఉరఫ్ కాళుడిని లోపలికి తీసుకువస్తూ నాతో అన్నది.
పేపర్‌లోంచి తలెత్తి చూసాను. నేరుగా నా దగ్గరికి వచ్చాడు కాళుడు.
"నేను అమెరికా వెళ్తున్నాను మావయ్య"
ఆ మాట చెపుతుంటే వాడి ముఖం వెలిగిపోతుండటాన్ని గమనించాను.
"ఏంట్రా ఏదన్నా కంపెనీలో ఉద్యోగం వచ్చిందా?" మెచ్చుకోలుగా అడిగాను.
వాడు నావైపు వింతగా చూశాడు.
"కాదు మామయ్య అమెరికాలో తెలుగు సంఘాల వాళ్ళు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దాన్ని రక్తికట్టించే బాధ్యతను నాకప్పగించారు." చెప్పడం ఆపాడు కాళుడు.
"అలాగా మరి ఎప్పుడు బయలుదేరుతున్నావు?" అడిగాను.
"వచ్చే ఆదివారం మావయ్య" బదులిచ్చాడు కాళుడు.
నా చూపు అప్రయత్నంగా క్యాలెండర్ మీద పడింది. ఆదివారానికి ఎదురుగా ఉన్న తేదీ మీద మిరియం అంటించినట్లుగా నల్లటి గుర్తు.
"శుభమా అని మొదటిసారి అమెరికా వెళ్తున్నావు. మంచి రోజు చూసుకుని బయలుదేరవచ్చుగా... పోయి పోయి అమావాస్య రోజు బయలుదేరుతున్నావేంటిరా?" చనువుతో కూడిన కోపంతో ప్రశ్నించాను.
"భలేవాడివే మావయ్య అన్నీ తెలిసిన నువ్వే ఇలా అడుగుతున్నావు... నా జీవితానికి అమావాస్యను మించిన మంచి రోజు ఏముంటుంది చెప్పు" నవ్వుతూ అన్నాడు.
మరిక ఆ విషయాన్ని నేను రెట్టించలేదు.
అమెరికాలో ఎన్ని రోజులుండేది, ఎక్కడ ఉండేది, మళ్ళీ ఇండియాకు ఎప్పుడు వచ్చేది నాకు వివరించి వెళ్ళిపోయాడు.
వాడు చెప్పింది నిజమే మరి.
సంవత్సరం క్రితం గాలికి తిరుగుతున్న మా కాళుడు ఇవాళ పైసా ఖర్చు లేకుండా గాలి (విమానం)లో అమెరికాకు వెళుతున్నాడంటే అదంతా అమావాస్య పుణ్యమే.

నా ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి.
ఏదో పనుండి కాళుడు వాళ్ళింటికి బయలుదేరాను.
ఇంటి గేటు తీయగానే కాళుడు వాళ్ళ నాన్న సుబ్బరామయ్య ఎవరినో కేకలేస్తున్నట్లుంది.
లోపలికి వెళ్ళేసరికి సుబ్బరామయ్య క్లాసు పీకుతుంటే కాళుడు చేతులు కట్టుకుని నిలబడున్నాడు.
తన మాటల్తో అందర్ని బుట్టలో వేసుకునే నోరు మెదపకుండా ఉండటం మరీ ఆశ్చర్యం కలిగించింది.
"నీకు నెలరోజులు టైమిస్తున్నాను. నీ గాలి తిరుగుళ్ళు మాని ఏదో ఒక ఉద్యోగంలోకి కుదురుకున్నావా సరి.. లేకుంటే నీ దారి నీది. మా దారి మాదే..."
నా రాక చూసి క్లాసు ఆపేసాడు సుబ్బరామయ్య.
కాళుడు లోపలికి వెళ్ళిపోయాడు.
కాళుడు ప్రయోజకుడు కాలేదంటూ సుబ్బరామయ్య నా దగ్గర వాపోయాడు.
పది రోజులు గడిచిపోయాయి.
ఒక రోజు పేపర్‌లో ఒక ప్రకటన నన్ను ఆకట్టుకుంది.
"అమావాస్య అంటే మీకు ఇష్టమా... వెలుగు రాకతో మాయమైపోతున్న చీకటి అంటే మరీ ఇష్టమా...
మరికెందుకు ఆలస్యం... మీకు కవి హృదయం ఉంటే... మీలోని కవిని బయటకు తీసి పదుగురి ఎదుట కవితా గానం చేయాలని ఉందా?! అయితే మీకు ఇదే మంచి అవకాశం... మీరు రాసిన ఒక కవితను మాకు పంపండి. దీపావళి పండుగను పురస్కరించుకుని త్యాగరాయగానసభలో మేము నిర్వహిస్తున్న కవితల పోటీలో పాల్గొనండి... కవితలు పంపవలసిన చివరి తేదీ.... ఇలా సాగిపోతూ ఉందా ప్రకటన...

ప్రకటన ఎవరు ఇచ్చారా అని చూశాను.
ఇంగువ గుడ్డ కాళేశ్వరరావు
కాళకవి హృదయ సమాఖ్య
అరే మన కాళుడే.... వింతగా ఉందే... ఈ సంగతి తెలిస్తే సుబ్బరామయ్య ఊరుకుంటాడా...
ఇలా అనుకుంటుండగానే కాళుడు మా ఇంట్లోకి వచ్చాడు.
అవతారమే మారిపోయింది. జీన్స్ ప్యాంట్, టీషర్టులలో తిరిగేవాడు లాల్చీ పైజామాలో కనిపిస్తున్నాడు.
"రావయ్యా.. రా.. నీకు నూరేళ్ళు.. ఇప్పుడే నీ ప్రకటన చూసాను. మీ నాన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా?"
నా ప్రశ్నను పెద్దగా పట్టించుకోకుండా నా సలహాలు కొన్ని తీసుకుని వెళ్ళిపోయాడు.
మరో మూడు రోజులలో దీపావళి పండుగ వస్తుందనగా నా దగ్గరకు ఇన్విటేషన్లతో వచ్చాడు.
ఇన్విటేషన్ నా చేతిలో పెట్టి "మీరు తప్పకుండా రావాలి మావయ్య". అన్నాడు.
కవర్ తెరిచి చూద్దును కదా ముఖ్య అతిథిగా సాంస్కృతిక శాఖ మంత్రి వేపకాయల వేదాంతం పేరు కనిపించింది.
"ప్రైవేట్ కార్యక్రమాలంటే చిరాకు పడే మంత్రిగారు కాళుడి కార్యక్రమానికి ఎలా వస్తున్నారబ్బా"
అదే అడిగాను వాడిని.

"చాలా సింపుల్ మావయ్య" తేలిగ్గా అనేసాడు కాళుడు.
నాకు చిరాకేసింది. నా చిరాకు న్యాయమైనదే. గతంలో మా ఆఫీసులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో వేదాంతం గారిని
ఛీఫ్ గెస్ట్‌గా పిలుద్దామని వెళ్ళి భంగపడిన అనుభవం నాది.
భుజానికున్న సంచిలోంచి కవితల పోటీలకు వచ్చిన అప్లికేషన్‌లలో ఒకదానిని తీసి నాకు అందించాడు. అప్లికేషన్‌ను పంపించిన వారి పేరు నా దృష్టిని ఆకర్షించింది.
"వేపకాయల వరదాయిని డాటర్ ఆఫ్ వేపకాయల వేదాంతం"
"ఈ అప్లికేష్ తీసుకెళ్ళి మంత్రిగారి సెక్రటరీ గారికి చూపించాను. అరగంటలో మంత్రిగారి నుంచి పిలుపు వచ్చింది. వారి చాంబర్‌లోకి వెళ్ళి "అమ్మాయిగారికి మీ చేతుల మీదుగా బహుమతిని ఇప్పించాలని మా ఆశ" అన్నాను. మారుమాట్లాడకుండా మంత్రి గారు వస్తామన్నారు" కాళుడు చెప్పడం ఆపాడు.
నా నోటమాట రాలేదు.
మళ్ళీ ఇన్విటేషన్‌‌లోకి తలదూర్చాను.
జడ్జిలలో ఒకరిగా నా పేరుంది.
"మంత్రిగారి కుమార్తెకు బహుమతి ముందుగానే నిర్ణయించి మళ్ళీ జడ్జిలెందుకురా" అడిగాను నేను.
"ఇది అంతకు ముందు అనుకున్నదిలే మావయ్య... నువ్వు రావాల్సిందే". నేను వస్తానని ఒప్పుకున్న తర్వాత కాని వాడు ఇంటికి వెళ్ళలేదు.

ఒక పక్క వీధుల్లో అక్కడక్కడా టపాసులు మోగుతుండగా దీపావళి అమావాస్యకు మూడు రోజుల ముందు కవితల పోటీ మొదలయ్యింది. మంత్రిగారు వస్తున్నారనేసరికి కార్యక్రమానికి అటు స్పాన్సర్లను, ఇటు ప్రేక్షకులను మా కాళుడు బాగానే సంపాదించుకున్నాడు. సభ కళకళలాడి పోతున్నది.
పోటీదారులు కవితా గానం సాగిస్తున్నారు. నాతో పాటు జడ్జిలుగా వచ్చిన మిగిలిన ఇద్దరు ఎదురుగా ఉన్న కాగితాల మీద ఏదో రాస్తున్నట్లు నటిస్తున్నారు. మా నటనకు జీవం పోస్తూ మధ్య మధ్యలో కాళుడు మా దగ్గరకు వచ్చి మాట్లాడి పోతున్నాడు. మంత్రి గారి కుమార్తె కవితాగానం విని మా మతి పోయింది. నా జీవితంలో అంత ఘోరమైన కవితను నేనెప్పుడు వినలేదు. పోటీలు ముగిసాయి.
ఉత్తమంగా కవితాగానం చేసిన అభ్యర్థిగా తన కుమార్తె వరదాయినికి మంత్రిగారు బహుమతిని ఇవ్వగానే హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది. మన కాళునిలోని కవిరాజ పోషకుని ప్రశంసిస్తూ మంత్రిగారు ప్రసగించడం...
అంతా కలలా జరిగిపోయింది.
పోటీలో పాల్గొన్న వారందరికి టపాకాయల పెట్టెలను కాళుని ఆధ్వర్యంలో మంత్రిగారు అందించారు.
అలా మొదలైంది కాళుని కవితా ప్రస్థానం...
చిక్కడిపల్లిలో మొదలైన మా వాడి కళాసేవ ఇప్పుడు ఖండాంతరాలకు చేరుకుంటున్నది.
అందుకే నేనంటాను....
మా కాళునికి అమావాస్య కలిసొచ్చిందని...
మరి మీరేమంటారు?!

Share this Story:

Follow Webdunia telugu