Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అటు ప్రభుత్వం... ఇటు పార్టీ : సర్వాంతర్యామి నరేంద్ర మోడీ!

అటు ప్రభుత్వం... ఇటు పార్టీ : సర్వాంతర్యామి నరేంద్ర మోడీ!
, గురువారం, 26 మే 2016 (13:23 IST)
నరేంద్ర మోడీ.. ఓ చాయ్ వాలా. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి. ఇపుడు దేశ ప్రధానమంత్రి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై గురువారానికి రెండేళ్లు. అంటే కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కారు రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్ళ కాలంలో అవినీతిని దరిచేరనీయని నేతగా మోడీ అందరినోటా ప్రశంసలు అందుకుంటున్నారు. అదేసమయంలో అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ సర్వాంతర్యామిగా వెలుగొందుతున్నారు. కాంగ్రెస్ 'ముక్త్ భారత్' నినాదంతో తెరపైకి వచ్చిన మోడీ... ఆయన అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రం నుంచి విముక్తి చేస్తూ వస్తున్నారు. 
 
దేశ ప్రజలకు 'అచ్చే దిన్', కాంగ్రెస్’ నుంచి భారత్‌ను విముక్తి చేస్తాం అనే రెండు ప్రధాన నినాదాలతో ఎన్నికల్లో పోరాడి అద్భుత విజయంతో కేంద్రంలో మోడీ పగ్గాలు చేపట్టారు. ఈయన సర్కారు గురువారంతో రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. మోడీ లక్ష్యాల్లో ప్రజలకు మంచి రోజులు ఇంకా మొదలు కాలేదు కానీ.. కాంగ్రెస్‌కు గడ్డు రోజులు మాత్రం పెరిగిపోతున్నాయి. మోడీ సర్కారు ఆర్థికాభివృద్ధి రంగంలో ఇంకా ముందడుగు వేసే క్రమంలోనే ఉన్నప్పటికీ.. ఆయన కేంద్ర బిందువుగా అధికార బీజేపీ రాజకీయ రంగంలో మాత్రం బలంగా దూసుకెళుతోంది. 
 
దేశ ఆర్థిక రంగంలో ఆశించినంత అభివృద్ధి లేకపోవటం, కొత్త ఉద్యోగాలు కల్పించలేకపోవటం, ధరలు పెరుగుతుండటం, అసహనతత్వం విస్తరిస్తుండటం వంటి వాటి ప్రతికూల అంశాలుగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మోడీ సర్కారుపై ఎక్కడా ప్రజావ్యతిరేకత మాత్రం కనిపించటం లేదు. పైగా మోడీ మీద సానుకూల పవనాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని.. ఆ కారణంగానే రాష్ట్రాల్లో సైతం బీజేపీ విస్తరిస్తూ అధికారంలోకి వస్తోంది. అదేసమయంలో స్వచ్ఛభారత్, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి భారీ కార్యక్రమాలతో పాటు సామాన్య ప్రజలకు ఆరోగ్యబీమా, రైతులకు పంట బీమా వంటి సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూలత సంపాదించుకుంది. 
 
అలాగే, గత రెండేళ్ళ మోడీ పాలనలో ఏ ఒక్కరిపైనా అవినీతి ఆరోపణలు రాకపోవడం బీజేపీ సర్కారు సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. కానీ, ఎన్నికల హామీల్లో ప్రధానమైన నల్లధనం వెనక్కు తెస్తామన్న మాట ఇంకా నెరవేరలేదు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి, ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైన బడా పెట్టుబడిదారులను వెనక్కు రప్పించటంలోనూ ఇంకా సఫలం కాలేదు. అలాగే, మోడీ అధికారంలోకి వచ్చాక కేంద్ర, రాష్ట్రాల బంధాలు మరింతగా బలపడ్డాయి. రాష్ట్రాలకు ఆర్థికంగా మరింత సాధికారం చేసేందుకు ఆయన సర్కారు పలు కీలక చర్యలు చేపట్టింది. 
 
ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.10 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవటం ద్వారా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి అవకాశాలను తగ్గించటం, ఆ ప్రయోజనాలు నేరుగా ప్రజలకే అందేలా చూడటంతో పాటు.. మరింత ఎక్కువమంది ప్రజలను, లావాదేవీలను ప్రధాన ఆర్థిక స్రవంతికి అనుసంధానం చేశారు. భారత విదేశీ విధానానికి నరేంద్ర మోడీ కొత్త జీవం పోశారనే నిపుణులు భావిస్తున్నారు. 
 
అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయటానికి.. తద్వారా దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించటానికి మోడీ గతంలో ఏ ప్రధానీ చేయని విధంగా అనేక దేశాల్లో పర్యటించారు.  రెండేళ్లలో ఐదు ఖండాల్లోని 40 దేశాలను సందర్శించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటూ పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ జన్మదినం రోజున సైతం అనూహ్యంగా అక్కడకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. అయితే.. పాక్‌తో సత్సంబంధాల సంగతేమో కానీ అంతర్జాతీయ వేదికపై మాత్రం భారత్‌ ప్రతిష్ట ఇనుమడించిందనే చెప్పవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాన్స్‌జెండర్‌కు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం.. ప్రాణాలు విడిచిన హక్కుల కార్యకర్త