Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాడు రైతు.. నేడు రౌతు... : ఇదీ కొత్త లంకేశ్వరుని రాజకీయ కథ!

నాడు రైతు.. నేడు రౌతు... : ఇదీ కొత్త లంకేశ్వరుని రాజకీయ కథ!
, శనివారం, 10 జనవరి 2015 (11:43 IST)
శ్రీలంక అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో మైత్రిపాల సిరిసేన విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఓటమి పాలయ్యారు. దీనికి కారణం అతి నమ్మకం, విశ్వాసమే. మరో రెండేళ్ళ పాటు అధికారం ఉండగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బోర్లాపడ్డారు. ఫలితంగా తాను తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారనేది వారి వాదన. 
 
2009లో ఎల్‌టీటీఈపై సాగించిన యుద్ధంలో భాగంగా.. లంక సైనికుల చేతుల్లో వేలాది తమిళులు ఊచకోతలకు గురయ్యారు. అప్పటినుంచీ రాజపక్షేపై గుర్రుగా ఉన్న తమిళులు.. అవకాశం రాగానే దెబ్బతీశారు. దేశ జనాభాలో 13 శాతంగా ఉన్న లంక తమిళులు రాజపక్షే పరాజయంలో కీలక భూమిక పోషించారు. తమిళ ఈలం సమస్యకు పరిష్కారం మార్గం కనుగొన్న నేతగా రాజపక్సేకు పేరు ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ముందు ఆయన తలవంచక తప్పలేదు. హోరాహోరీ పోరులో తుదకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి, రాజపక్షే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేత, తన చిరకాల స్నేహితుడైన మైత్రిపాల సిరిసేనను (63) అధికారం వరించింది. 
 
కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన మైత్రిపాల సిరిసేన ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. వెనకబడిన ఉత్తర మధ్య ప్రాంతంలో 1951 సెప్టెంబర్‌ 3వ తేదీన సిరిసేన జన్మించారు. ఆయన తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీరజవాను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి.. 1971లో సిరిసేన రెండేళ్లు జైలులో ఉన్నారు. 1989లో తొలిసారి యునైటెడ్‌ ఫ్రీడమ్‌ పార్టీ తరపున పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
 
ఈయనలో మచ్చుకైనా లంక రాజకీయ నాయకుడి లక్షణాలేవీ సిరిసేనలో కనిపించవు. ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడగా చూసినవారు లేరు. వస్త్రధారణలో రాజఠీవి ఎక్కడా కనిపించదు. తన పేరు వెనుక పెద్ద పెద్ద డిగ్రీలు లేవు. గత పాలకుల్లా ఆయన కొలంబో విశ్వవిద్యాలయం విద్యార్థి కాదు. ‘రాజపక్షే పాలనని అంతం చేయడమే నా లక్ష్యం’ అని ప్రకటించడమే కాకుండా, శ్రీలంకలో ఉన్న రాజకీయ నేతల్లో అవినీతి మురికిని అంటించుకోని పారదర్శక, సాధారణ విలక్షణ రాజకీయ నేత. 
 
పైగా, ప్రతిపక్షాల బలహీనతే తన బలంగా మార్చుకొని దూసుకుపోతున్న రాజపక్షేని అడ్డుకొనేందుకు అన్ని పార్టీలను ఒక్కటి చేసిన ఆజాతశత్రువు. నిజానికి ఒకనాడు రాజపక్షేకు నమ్మిన బంటు. ఆయన మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా విధులు నిర్వహించి మద్యం, ధూమపానానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇందుకోసం విస్తృత ప్రచారం కల్పించారు. 
 
అయితే, రాజపక్షే కుటుంబ పాలన, నియంత వైఖరికి నిరసనగా.. మంత్రివర్గం నుంచి బయటకొచ్చి చెల్లాచెదురైన విపక్షాలన్నింటినీ ఒక్కటి చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా అధ్యక్షుడికి విశేష అధికారాలను కట్టబెడుతున్న 18వ రాజ్యాంగ సవరణను రద్దు చేస్తానని ప్రకటించి ప్రజలను తన వైపు తిప్పుకొన్నారు. శ్రీలంక పాలనా పగ్గాలు ఒకే కుటుంబం చేతిలో ఉందని, దీనికి చరమగీతం పాడాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా, రాజపక్సే హయాంలో చోటు చేసుకున్నా అనేక అవినీతి కుంభకోణాలను బయటపెట్టారు. పైగా.. శ్రీలంకలోని అన్ని మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలను తన సాదాసీదా మాటలతో ఆకట్టుకుని లంకాధీశుడిగా పగ్గాలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu