Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళను కట్టేసి అత్యాచారం... అఖిలేష్ సర్కారుకు మూడిందా...?!!

మహిళను కట్టేసి అత్యాచారం... అఖిలేష్ సర్కారుకు మూడిందా...?!!
, మంగళవారం, 17 జూన్ 2014 (15:33 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. రోజూ ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. అఖిలేష్ సర్కార్ పట్టింపులేని ధోరణి కారణంగానే ఈ సంస్కృతి మరింత పెరిగిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయూన్ జిల్లాలో ఇద్దరు అక్కచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి తెగబడటమే కాకుండా వారిద్దరిని ఉరి తీసిన సంఘటన దేశాన్ని కుదిపేసింది. అది మర్చిపోకముందే అదే జిల్లాలో మరిన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి.
 
జిల్లాలోని బిసైలీ ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ ఆస్పత్రికి వెళుతున్న సమయంలో సమీప ఆస్పత్రిలో కంటే మెరుగైన చికిత్స చేయిస్తామంటూ ఇద్దరు యువకులు ఆమెను, ఆమె పిల్లలిద్దరినీ నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి ఆ ఇంటిలో ఆమెను బంధించారు. అనంతరం మరో యువకునితో కలిసి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఉదయాన్నే ఆమెను వదిలేస్తూ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. తనపై రేప్ చేసినవారిలో ఒక యువకుడు పోలీసు కానిస్టేబుల్ కుమారుడని బాధితురాలు పేర్కొంది. 
 
అలీగఢ్ జిల్లాలో మరో ఘోరం చోటుచేసుకున్నది. జిల్లాలోని సబాపూర్ కు చెందిన ఓ యువతి జూన్ 14న ఓ కుర్రాడిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. ఐతే ఆమెను చూసిన సోదరులు ఆమెను గొడ్డును బాదినట్లు కొట్టి కిరోసిన్ పోసి సజీవంగా తగులబెట్టి హత్య చేశారు. ఆ తర్వాత కాల్చి బూడిద చేశారు. 
 
ఇలా వరుస అరాచక సంఘటనలతో ఉత్తరప్రదేశ్ ఉడుకెత్తిపోతోంది. ఐతే అఖిలేష్ యాదవ్ మాత్రం తమ రాష్ట్రం చాలామటుకు నయం అంటూ హితోక్తులు చెప్తున్నారు. పరిస్థితి మాత్రం ఆయన చెప్పినట్లు లేదనే వాదనలు వినబడుతున్నాయి. దీనికితోడు దుండగులు కొందరు ఇద్దరు కానిస్టేబుళ్లను కాల్చి చంపడం కూడా సంచలనమైంది. తాజాగా యూపీ గవర్నర్ రాజీనామాతో అఖిలేష్ యాదవ్ సర్కారుపై కేంద్రం కొరడా ఝుళిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu