Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజినీకాంత్ గారూ మీకో దండం : భాజపాలో చేరొద్దు.. అమిత్ షా!!

రజినీకాంత్ గారూ మీకో దండం : భాజపాలో చేరొద్దు.. అమిత్ షా!!
, సోమవారం, 29 డిశెంబరు 2014 (10:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గట్టి షాకిచ్చినట్టు సమాచారం. భాజపాలో చేరే విషయంపై రజినీకాంత్ సాగదీత ధోరణిని అవలంభిస్తుండటంతో అమిత్ షా కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో రజినీని పార్టీలో చేరమని ఎవరూ కూడా కోరవద్దని రాష్ట్ర నేతలకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. 
 
నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రంగా తమిళనాడు ఉంది. ఈ రాష్ట్రంలో రజినీకాంత్ వంటి ప్రముఖులను చేర్చుకుని అధికారంలోకి రావాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందుకోసం ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే నేతలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో, దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న బీజేపీకి... తమిళనాడులో పాగా వేయడానికి ఇదే సరైన సమయంగా ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతో పాప్యులారిటీ ఉన్న రజినీ తమతో జత కలిస్తే, ఎన్నికల్లో తిరుగుండదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి నేతలు అంచనా వేశారు. ఇదే అంశంపై మోడీతో పాటు.. అమిత్ షాలు కూడా రజినీతో సంప్రదింపులు కూడా జరిపారు. 
 
ఈ పరిస్థితుల్లో ఇటీవల 'లింగ' సినిమా షూటింగ్ సమయంలో రజనీని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యక్తిగతంగా కలిశారు. అదేసమయంలో, అమిత్ షా కూడా రజనీతో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సైతం రజినీని అతని నివాసంలో కలిసి పార్టీలో చేరికపై మాట్లాడారు. బీజేపీ తరపున సీఎం అభ్యర్థి మీరేనంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. దీంతో, బీజేపీలో రజనీ చేరిక ఖాయమని అందరూ భావించారు. అయితే, పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
 
అయితే, ఇటీవల చెన్నైకు వచ్చిన అమిత్ షా రజనీ అంశంపై కూడా పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. తాను మరోసారి చెన్నై రాకముందే రజనీ తన నిర్ణయాన్ని తెలపాలని కోరారు. అయితే, సూపర్ స్టార్ మాత్రం మరోసారి సాగతీత ధోరణిని అవలంబించారు. నాలుగు నెలలు ఓపిక పట్టండి అంటూ రజనీ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చిర్రెత్తుకొచ్చింది. 
 
ఇప్పుడు మళ్లీ సమయం కావాలని కోరడంలో అర్థం లేదని అమిత్ షా అన్నారట. ఇబ్బందికర పరిస్థితుల్లో బీజేపీలోకి రజనీకాంత్ రావాల్సిన అవసరం లేదని అమిత్ కుండబద్దలు కొట్టారట. బీజేపీలో మోడీ తర్వాత నెంబర్ టూ అయిన అమిత్ షానే ఈ అభిప్రాయానికి రావడంతో, ఇక బీజేపీలోకి రజనీ చేరిక అసంభవమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu