Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరం పోటుతో మాయమైపోనున్న గిరిజనులు... దొరా... మా బతుకులేంటి?

పోలవరం పోటుతో మాయమైపోనున్న గిరిజనులు... దొరా... మా బతుకులేంటి?
, ఆదివారం, 13 జులై 2014 (17:01 IST)
ఎవరినీ లెక్కచెయ్యని చరిత్ర  ఆదివాసుల సొంతం. అత్యంత దుర్మార్గమైన బ్రిటిష్ ఆధిపత్యాన్నే ఎదిరించి మన్యం రాజు అల్లూరి సీతారామరాజకు అండగా నిలబడిన వారు. తమ కొండలను, కోనలను అపురూపంగా చూసుకుంటూ మాయా.. మర్మం తెలియని అమాయక జీవులు. అడవినే నమ్ముకుని అడవితల్లి ఒడిలో సేద దీరుతున్న గిరిపుత్రులు. తమ ఊరును, వాడలను మునిగిపోయిన తమ నేలను గురించి గోడ మీద ఓ బొమ్మలా గీసుకుంటారు. పోలవరం ముంపు గ్రామల మాయలో మునిగిపోతున్న గిరజనులపై ఓ కథనం... 
 
పోలవరం ప్రాజెక్టు పుణ్యమా అని లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులు కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 278 నుంచి 370 గ్రామాలూ, దాదాపు లక్షా పదివేల ఎకరాల్లో పంట పొలాలు జల సమాధి కాబోతున్నాయి. భారీ స్థాయిలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది. ఇంతకాలమూ వన్ ఆఫ్ సెవంటీ చట్టం రక్షణలో ఒదిగిన గిరిజనులు, ఆదివాసీలు పునరావాస ప్రాంతాల్లో తలదాచుకోవాల్సి పరిస్థితి ఏర్పడనుంది. ప్రకృతి ఒడిలో జీవించే గిరిజనులకు మరో జీవన విధానం తెలియదు. అలాంటి అడవి బిడ్డలకు జీవన్మరణ సమస్య సృష్టించడం అమానవీయం అంటున్నారు. 
 
అయితే పట్టణ పేదలను ఒక ఇంటి నుంచి వేరొక ఇంటికి తరలించడానికి, గిరిజనులను ఒక ఇంటి నుంచి మరో ఇంటికి తరలించడానికి చాలా తేడా ఉంది. కొత్త ప్రాంతానికి అలవాటు పడేంత జ్ఞానం గిరిజనులకు లేదు. వారిని మరో అడవికి లేదా ఉంటున్న అడవిలోనే మరో చోటుకు తరలించినా అది వారి సహజ ఆవాసానికి ఏమాత్రం సరిపోలదు. అటువంటివి వారిని మైదాన ప్రాంతాల్లోకి తీసుకువస్తే వారు ఎలా బతకుగలరో ఒక్కసారి ఆలోచించాలి.
 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వేలాదిమంది గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుంది. గిరిజనులకు, ఇతరులకు మధ్య తేడాను షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు(అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 గుర్తించింది. అడవుల్లో నివశించడం, సొంత వ్యవసాయం, చిన్నపాటి అటవీ ఉత్పత్తులను సేకరించడం, వినియోగించడం, విక్రయించడం తదితర గిరిజన హక్కులను ప్రభుత్వం గుర్తించింది. గిరిజనులకు అడవికి మధ్య సంబంధాన్ని కేవలం జీవనంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోరాదు. 
 
దాంతోపాటే సామాజిక, సాంస్కృతిక, సాంప్రదాయక, మానసిక అనుబంధంగా భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కాని ప్రైవేటు రంగం కాని అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట ఇటువంటి చర్యలను చేపట్టినపుడు ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒకవేళ ముంపు ప్రాంతాల గిరిజనులకు నష్టపరిహారంగా ఎంతో కొంత పైకాన్ని ఇచ్చినా నిరాశ్రయులైన గిరిజనులకు దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అంతేగాక, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి వారిని తరలించడం కూడా ఎంతో సంక్లిష్టతతో కూడుకున్నది. అదీకాక పునరావాస కార్యక్రమాలు విజయవంతమైన దాఖలాలు ఎక్కడా లేవన్నది సుస్పష్టం. 
 
విఫల పునరావాస కార్యక్రమాల వల్ల గిరిజనులలో అశాంతి ఏర్పడి గిరిజనులకు జల్, జమీన్, జంగిల్ కల్పిస్తామని వాగ్దానం చేస్తున్న తీవ్రవాదుల పట్ల వారు ఆకర్షితులయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు నిపుణులు. దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల ప్రభుత్వాలు గిరిజనులకు పునరావాసం అనే పదం కేవలం నోటి మాట ద్వారానో.. లేక కాగితాల మీదనో గాక పునరావాసం అనే పదానికి కొత్త అర్థం చెప్పాలి. గిరిజన బతుకుల్లో వెలుగురేఖలు పూయించాలి.. అపుడే పోలవరం ప్రాజెక్టుకు సార్థకత చేకూరుతుంది. గిరిపుత్రుల నవ్వులు పువ్వుల మధ్య పోలవరం ప్రాజెక్టు నుంచి జలధార పరవళ్ళు తొక్కాలి. అపుడే బహుళార్థక సాధక ప్రాజెక్టు కల నిజంగా సాకారమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu