Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఐపీఎస్‌కు అంత క‌ష్టం ఏమొచ్చింది?

విశాఖ‌: చిన్న వయసులోనే ఐపీఎస్ అధికారి అయ్యాడు. ఉన్నత హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్ది కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. త్వరలోనే వివాహం చేసుకుని జీవితంలోనూ స్థిరపడాలనుకున్నాడు. కానీ ఇంతలోనే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందాడు. పాడేరు ఏఎస్ప

ఆ ఐపీఎస్‌కు అంత క‌ష్టం ఏమొచ్చింది?
, శనివారం, 18 జూన్ 2016 (18:05 IST)
విశాఖ‌: చిన్న వయసులోనే ఐపీఎస్ అధికారి అయ్యాడు. ఉన్నత హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్ది కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. త్వరలోనే వివాహం చేసుకుని జీవితంలోనూ స్థిరపడాలనుకున్నాడు. కానీ ఇంతలోనే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందాడు. పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ గురువారం బుల్లెట్ తలకు తగలడంతో మృతి చెందారు. ఆయన మరణంపై విచారణకు సీఐడీ రంగంలోకి దిగుతోంది. విచారణలో నిజాలు బయటకొస్తే తప్ప శశికుమార్ మృతికి కారణాలు వెల్లడికావు. అయితే ఈ సంఘటనపై అనేక అనుమానాలు, వాదనలు బయటకు వస్తున్నాయి. అధికారులు చెబుతున్నట్లు తుపాకీ మిస్‌ఫైర్ అయిందా, లేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారా అనేది మిస్టరీగా మిగిలింది. ఆయనను హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
 
శ‌శికుమార్ తన తోటివారితో శాంతంగా ఉంటారు. కానీ నేరస్థులకు మాత్రం నిద్ర లేకుండా చేస్తారు. ఇది పాడేరులో ఆత్మహత్యకు పాల్పడిన శశికుమార్ గురించి దగ్గరగా ఉన్నవారు చెప్పే సమాచారం. గ్రేహౌండ్స్ నుంచి ఆళ్లగడ్డ ఏఎస్పీగా వస్తూనే ఎర్రచందనం స్మగ్లర్ల పనిపట్టారు. విశాఖ ఏజెన్సీలో అడుగుపెట్టి గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు.  జి.మాడుగుల, పాడేరు, అనంతగిరిలో గంజాయి రవాణా, స్టోరేజీ కేంద్రాలపై దాడులు చేసి వేలాది కేజీల గంజాయిని పట్టుకున్నారు. మావోయిస్టుల కదలికలపైనా దృష్టి సారించారు. ఈ దూకుడే ఆయనను ఉన్నతాధికారులకు దూరం చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి శశికుమార్ వేధింపులు ఎదుర్కొని ఉండవచ్చని భావిస్తున్నారు.
 
ఏజెన్సీలో మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణంతో గిరిజనులపై కేసులు పెడుతుంటారు. అమాయకులపై కేసులేంటని శశికుమార్ ఇటీవల కొందరు గిరిజనులకు క్లీన్‌చిట్ ఇచ్చారని, ఈ విషయంపై రెండు రోజుల క్రితం గంజాయి సాగు నివారణపై ఐటీడీఏలో ఉన్నతస్థాయి సమావేశానికి వెళ్లిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని, దాంతో మనస్తాపానికి గురై ఉండవచ్చని అంటున్నారు. మరోవైపు గంజాయి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏజెన్సీలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ కోవలో శశికుమార్ మరణం వెనుక మరో వాదన బలంగా వినిపిస్తోంది.

పాడేరు ప్రాంతంలోని దాదాపు 70 మంది మావోయిస్టులు, మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. వారి అరెస్టును నేడో రేపో ధృవీకరించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మావోయిస్టులు పథకం ప్రకారం ఏఎస్పీని మట్టుబెట్టి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏఎస్పీ నివాసంలో ఉదయం వేళ భద్రత పెద్దగా ఉండదు. పై అంతస్థులో జీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉంటున్నారు. ఏఎస్పీ ఉంటున్న అంతస్థులోనే వెనుక వైపు ఆయన సీసీ, బయట గదిలో హోం గార్డు నిద్రిస్తుంటారు. 
 
ఉదయం శశికుమార్ నిద్ర లేచి బెల్ కొట్టినపుడు ఆయన చాంబర్‌లోకి ఫైళ్లు తీసుకుని వెళతారు. అంతవరకు ఆయన వద్దకు ఎవరూ వెళ్లరు. ఆయన ఎవరినైనా కలవాలనుకుంటే అదే సమయంలో కలుస్తుంటారు. భద్రతా సిబ్బంది కాలకృత్యాలు తీర్చుకునే పనిలో ఉంటారు. ఈ క్రమంలో మావోయిస్టులెవరైనా సందర్శకుల మాదిరిగా వచ్చి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు మూడు రోజుల పాటు తనకు సెలవు కావాలని శశికుమార్ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశారు. ఐతే ఏ విషయంపై సెలవు పెట్టారనే అంశంపై స్పష్టత లేదు. ప్రాధమికంగా ఆయన పెళ్లి పనులకు సంబంధించి చెన్నై వెళ్లేందుకు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఎస్పీ కేసును అధికారులు సీఐడికి అప్పగించారు. దీంతో త్వరలోనే ఆయన మృతికి సంబంధించిన నిజానిజాలు తెలుస్తాయని ఉన్నతాధికారులు అంటున్నారు. ఓ ఐపీఎస్ ఆత్మహత్య చేసుకోవడం ఉన్నతాధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లండన్‌లో సుహేల్ పుస్తకావిష్కరణ: హాజరైన విజయ్ మాల్యా.. పిలవలేదట.. ట్విట్టర్లో..?