Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు తేజం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి నేడు...

తెలుగు తేజం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి నేడు...
, శనివారం, 28 మే 2016 (09:21 IST)
తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావు 92వ జయంతి వేడుకలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన భార్య లక్ష్మీపార్వతితో పాటు.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలోని గ్రేట్ లెజెండ్ హీరోల్లో ఎన్టీఆర్ అగ్రగణ్యుడు. అనితర సాధ్యమైన పాత్రలు ధరించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటుడు. పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టినపిండి. సాంఘిక పాత్రలు అలవోకగా పోషించిన ధీశాలి. పాజిటివ్ కేరక్టర్లే కాదు నెగటివ్ పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించిన సాహసి. 
 
ఎన్నో రకాల పాత్రలు, వేరియేషన్స్ ఉన్న కేరక్టర్లూ పోషించి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడయ్యాడు. తెలుగు సినీ సింహాసంపై రారాజుగా భాసిల్లాడు. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా ఇలాగే ఉంటాడు అనేలా ఆ పాత్రల పోషణ చేసి, ప్రేక్షకుల హృదయాలలో దేవుడై నిలిచాడు. ఎన్.టి.రామారావు సినిమాలలో పౌరాణికాలు, చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు, భక్తి రస చిత్రాలు… కలకాలం నిలిచిపోయేవి ఎన్నో ఉన్నాయి.
 
1953లో షూటింగ్ మొదలైన 'ఇద్దరు పెళ్ళాలు'లో మూడుపదుల వయసులో ఓ స్వప్నగీతంలో తెరపై కృష్ణుడిగా తొలిసారిగా కనిపించారాయన. అప్పటి నుంచి 56 యేళ్ల వయసులో 'శ్రీతిరుపతి వెంకటేశ్వర కల్యాణం' (79) దాకా 27 యేళ్ళ వ్యవధిలో ఒకే పాత్రను సుమారు 30 చిత్రాల్లో పోషించడం, జనాన్ని మెప్పించడం ఓ చరిత్ర. ప్రపంచ సినీ చరిత్రలో అలా ఒకే పాత్రను అన్నేళ్ళ పాటు చేసిన నటుడు ఇంకొకరు లేరు. ఇక, తెరపై ఓ నిర్దిష్టమైన వయసులోనే కనిపించే కృష్ణ పాత్రను వయసులో వచ్చిన మార్పులకు అతీతంగా మెప్పించడమూ ఆయనకే చెల్లింది.  
 
పౌరాణికాల్లో ఎంతగా అలరించాడో, కొన్ని సాంఘిక చిత్రాల్లో విషాద పాత్రల్లో నటించి కంటతడి పెట్టించాడు. హాస్యపాత్రల్లో రాణించాడు. కుటుంబ కథా చిత్రాల్లో సాటిలేదనిపించాడు. సకల మనోభిరాముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిద్ధాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హాదో ఇవ్వనంటే ఎలా.. ఈ మాట అప్పడెందుకు చెప్పలేదు : హరికృష్ణ