Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మామ్ టూర్ సక్సెస్‌ : మంగళయాన్‌లో ఇస్రో జర్నీ!

మామ్ టూర్ సక్సెస్‌ : మంగళయాన్‌లో ఇస్రో జర్నీ!
, బుధవారం, 24 సెప్టెంబరు 2014 (15:09 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహ కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్‌)ను పంపడంలో విజయవంతమైంది. ఫలితంగా చైనా, జపాన్ వంటి దేశాలకు సాధ్యం కానిది ఇస్రో సాధ్యమయ్యేలా చేసింది. నాసా సహా, అరుణగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపడంలో ఇప్పటి వరకు ఎవరూ తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ను అందుకోలేదు. రష్యా ఏకంగా తొమ్మిది సార్లు ప్రయోగం చేసి.. విఫలమైన తర్వాతే.. పదోసారి విజయాన్ని అందుకుంది. కానీ, భారత్ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ప్రపంచ దేశాలను అబ్బురపరిచింది. 
 
భారత్ ప్రయోగానికి ముందు, ప్రపంచవ్యాప్తంగా అంగారక గ్రహంపైకి ఉపగ్రహాలు పంపడానికి 51 సార్లు ప్రయత్నాలు జరిగాయి. వీటిలో కేవలం 21 సార్లు మాత్రమే ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇస్రో విజయానికి ముందు వరకు మూడు అంతరిక్ష సంస్థలు మాత్రమే అంగారక గ్రహంపైకి ఉపగ్రహాలను పంపడంలో సఫలమయ్యాయి. అమెరికా, మాజీ సోవియట్ యూనియన్, యూరోపియన్ యూనియన్‌లకు చెందిన సంస్థలు అరుణగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాలను విజయవంతంగా పంపగలిగాయి.
 
సాంకేతికంగా భారత్ కన్నా ఎంతో ముందున్న జపాన్, చైనాలు కూడా మార్స్ ప్రయోగాల్లో విఫలమయ్యాయి. అంగారక గ్రహంపైకి జపాన్ ప్రయోగించిన ఉపగ్రహం మధ్యలో ఇంధనం అయిపోయిన కారణంగా విఫలమైంది. చైనా 2011లో మార్స్ పైకి పంపించాలనుకున్న ఇంగ్హో 1 ఉపగ్రహం లాంచింగ్ సమయంలోనే ఫెయిలైంది. 
 
కానీ, ఇస్రో మాత్రం మామ్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. మామ్‌ను తయారుచేయడానికి ఉపయోగించిన మెటీరియల్స్ నుంచి... మామ్‌ను లాంచ్ చేసే టెక్నాలజీ వరకు అంతా 'మేడిన్ ఇండియానే' కావడం గమనార్హం. ముఖ్యంగా.. అత్యంత తక్కువ బడ్జెట్‌తో ఇస్రో మార్స్ మిషన్‌ను పూర్తి చేసింది. మంగళ్ యాన్ ప్రయోగానికి భారత్ ప్రభుత్వం ఇస్రోకు కేటాయించింది కేవలం రూ.450 కోట్లు. ఇది హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'గ్రావిటీ' చిత్ర నిర్మాణానికి అయిన ఖర్చు కంటే తక్కువ కావడం గమనార్హం. 
 
కేవలం మూడంటే మూడేళ్లలో ఇస్రో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. సరిగ్గా, మూడేళ్ల క్రితం అంగారక గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపించాలని ఇస్రో నిర్ణయం తీసుకుంది. ఆలోచన వచ్చిన మూడేళ్లకే ఇంత భారీ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం సాధారణ విషయం కాదని అంతరిక్షశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu