Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమిత్ షాకు షాక్: అప్పుడేమో రజనీకాంత్.. ఇప్పుడేమో విజయకాంత్!!

అమిత్ షాకు షాక్: అప్పుడేమో రజనీకాంత్.. ఇప్పుడేమో విజయకాంత్!!
, శనివారం, 6 ఫిబ్రవరి 2016 (16:15 IST)
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు తమిళనాట షాకులే ఎదురవుతున్నాయి. తమిళనాట బీజేపీని బలోపేతం చేయాలనే ఆలోచనలకు గండిపడుతున్నాయి. గతంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బీజేపీలో చేర్పించుకుని.. తమిళనాట విజయబావుటా ఎగురవేయాలని అమిత్ షాతో పాటు ప్రధాని మోడీ విశ్వ ప్రయత్నాలు చేశారు. 
 
అయితే రాజకీయాలకు రజనీకాంత్ దూరంగా ఉంటూ.. ఏదో ఒక కారణం చెప్పుకుంటూ జారుకోవడం బీజేపీ శ్రేణుల్లో నిరాశను మిగిల్చింది. ఇక రజనీతో లాభం లేదనుకున్న అమిత్ షా డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌నైనా దారిలోకి తెచ్చుకుందామనుకున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీతషాను శుక్రవారం కలుసుకుంటారని ప్లాన్ చేశారు. అయితే కమలనాథులకు తీవ్ర నిరాశే ఎదురైంది. చివరిక్షణంలో విజయకాంత్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకోవడంతో బీజేపీ జాతీయ నేతలు ఖంగుతిన్నారు. 
 
ఇటీవల కేరళ పర్యటనకు విచ్చేసిన అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలతో అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై సమగ్రంగా చర్చలు జరిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో చోటుచేసుకున్న పీఎంకే, డీఎండీకే పార్టీలతో మళ్లీ కూటమి ఏర్పడితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఆశించినంత ఫలితం వుంటుందని రాష్ట్ర నేతలు సూచించారు. ఆ మేరకు శుక్రవారం అమిత్‌షాను ఢిల్లీలో కలుసుకొని ఎన్నికల పొత్తు ఖరారుపై నిర్ణయాలు తీసుకుంటారని ఎదురుచూశారు.
 
ప్రస్తుతం విజయకాంత్ పార్టీ నేతలతో ఎన్నికల ఏర్పాట్ల సమీక్షలో వుండడంతో వారం రోజుల వరకు ఢిల్లీ వెళ్లే ప్రసక్తే లేదని తెలుస్తోంది. మరోవైపు విజయకాంత్ కోసం కాంగ్రెస్ కూడా ఆశతో ఎదురుచూస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చర్చలు జరిపేందుకు రావలసిందిగా డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌కు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్ కూడా పిలుపు నిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu